Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ ఎవరు? ఫైర్ అయిన కుంతియా?

By:  Tupaki Desk   |   18 Sep 2019 9:13 AM GMT
పవన్ కల్యాణ్ ఎవరు? ఫైర్ అయిన కుంతియా?
X
'సేవ్ నల్లమల’ అంటూ పవన్ కల్యాణ్ అఖిలపక్ష సమావేశం అనగానే ఎగేసుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలకు సొంత పార్టీ నుంచినే క్లాసులు పడుతున్నాయని తెలుస్తోంది. అసలు పవన్ కల్యాణ్ ఎవరు? అతడికి ఉన్న స్థాయి ఎంత? అతడు పిలవగానే వీరు వెళ్లడం ఏమిటి? అంటూ ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయట. ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా ఈ విషయంలో తమ నేతలను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ స్థాయి ఏమిటో ఓటర్లే చాటి చెప్పారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి - రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి పవన్. ఇక ఎన్నికల్లో ఆయన పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్నో కూడా అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ తో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప పరిస్థితుల్లో ఉందో చెప్పనక్కర్లేదు.

అందులోనూ దేశ రాజకీయాల్లోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ. పవన్ కల్యాణ్ రాజకీయాలు గెస్ట్ అప్పీరియన్స్ లా సాగుతూ ఉంటాయి. ఇక తెలంగాణలో అయితే పవన్ కల్యాణ్ పార్టీ బిగ్ జీరో. ఏపీలో సింగిల్ డిజిట్ శాతం ఓట్లు అయినా వచ్చాయి. తెలంగాణలో అంత సీన్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లి పవన్ తో కూర్చోవడం - ఆయనతో చర్చలు.. అఖిలపక్షం అంటూ వెళ్లడం పై కుంతియా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ కింద పవన్ కల్యాణ్ పని చేస్తే ఓకే కానీ - పవన్ కిందకు కాంగ్రెస్ నేతలు వెళ్లడం ఏమిటని ఆయన ప్రశ్నించాడట. అలాగే తెలంగాణలోని ఇతర కాంగ్రెస్ లీడర్లు కూడా ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టుగా సమాచారం.