Begin typing your search above and press return to search.

డిగ్గీకి డ‌బుల్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్ పెద్ద‌లు

By:  Tupaki Desk   |   1 Aug 2017 10:40 AM GMT
డిగ్గీకి డ‌బుల్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్  పెద్ద‌లు
X
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌ - దిగ్విజయ్‌ సింగ్‌ కు ఆ పార్టీ అధిష్టానం ఊహించ‌ని షాక్ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ను తొలగించింది. అంతేకాకుండా దిగ్విజ‌య్ సింగ్‌కు జూనియ‌ర్ అయిత‌న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల అద‌న‌పు ఇన్‌ చార్జిగా ఉన్న ఆర్‌ సీ కుంతియాకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇటీవ‌లి కాలంలో తెలంగాణ ప్ర‌భుత్వం, టీఆర్ ఎస్ పార్టీపై దిగ్విజ‌య్ సింగ్ దూకుడుగా ముందుకు సాగుతున్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు డ్ర‌గ్స్ మాఫియాతో సంబంధం ఉంద‌ని డిగ్గి ఆరోపించారు. అంత‌కుముందు ఐసిస్‌ సానుభూతిపరుల విషయంలోనూ ప్ర‌భుత్వం తీరును డిగ్గీ త‌ప్పుప‌ట్టారు.

మ‌రోవైపు గ‌త కొద్దికాలం క్రితం సైతం ఇదే అనుభ‌వం ఎదురైంది. ఒకే స‌మ‌యంలో డ‌బుల్ షాక్ అన్న‌ట్లుగా రెండు రాష్ర్టాల ఇంచార్జీ బాధ్య‌త‌ల నుంచి దిగ్విజ‌య్ సింగ్‌ ను ఊడ‌బీకింది. ఇటీవ‌లే ఎన్నిక‌లు పూర్త‌యిన‌ గోవా - వ‌చ్చే ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న కర్ణాటక రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ కార్యదర్శి పదవి నుంచి ఆ పార్టీ తొలగించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోవడమే కాకుండా, పెద్ద సంఖ్యలో స్థానాలను కూడా గెలుచుకోలేక పోవడంతో ఆయనను ఆ బాధ్యతల నుండి తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీలో పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్న అధ్యక్షురాలు సోనియాగాంధీ కర్ణాటక ఇన్‌ ఛార్జ్‌ జనరల్‌ సెక్రటరీగా కేసీఆర్ వేణుగోపాల్‌ ను నియమించారు. ఆయనతో పాటు మరో నలుగురు కార్యదర్శులను నియమించారు. ఈ క్ర‌మంలో గోవాలో కూడా దిగ్విజయ్‌ సింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ సెక్రటరీ ఎ. చెల్లా కుమార్‌కు ఆ రాష్ట్ర ఇన్‌ ఛార్జ్‌ సెక్రటరీగా పదోన్నతి కల్పించారు.

కాంగ్రెస్‌ గోవా శాఖ ఇన్‌ ఛార్జ్‌ గా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. గోవాలో మొత్తం 40 స్థానాలకు గాను 17 స్థానాలు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది. కేవలం 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీ అక్కడ అధికారంలో కైవసం చేసుకుంది. దిగ్విజయ్‌ నిష్క్రియాపర్వంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఇంచార్జీగా దిగ్విజ‌య్ సింగ్‌ ఉన్నారు. తాజాగా ఆయ‌న్ను తెలంగాణ బాధ్య‌త‌ల నుంచి తొల‌గించడం గ‌మ‌నార్హం.