Begin typing your search above and press return to search.

త్యాగాల లిస్టు చెబుతూ..అమెరికాపై దాయాది ఫైర్‌

By:  Tupaki Desk   |   5 Jan 2018 4:32 AM GMT
త్యాగాల లిస్టు చెబుతూ..అమెరికాపై దాయాది ఫైర్‌
X
ఉగ్ర‌వాదుల విష‌యంలో పాకిస్థాన్ అనుస‌రిస్తున్న వైఖ‌రిపై అమెరికా అధ్యక్షుడు సీరియ‌స్ కావ‌టం తెలిసిందే. మా ద‌గ్గ‌ర నుంచి వేలాది కోట్ల రూపాయిల్ని సాయంగా తీసుకొని.. ఉగ్ర‌వాదుల్ని పెంచి పోషిస్తారా? తిరిగి మా వాళ్ల‌నే చంపిస్తారా? మీ కుటిల బుద్ధి మాకు తెలిసిందంటూ ట్రంప్ సీరియ‌స్ కావ‌టం తెలిసిందే. పాక్ లో అడ్డాగా ఉండే తీవ్ర‌వాదుల క్యాంపుల్ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఎత్తేయించ‌మ‌ని తాము ఎన్నిసార్లు చెప్పినా డ‌బుల్ గేమ్ ఆడుతూ దుష్ట‌బుద్ధిని ప్ర‌ద‌ర్శించిన పాక్ కు షాకిస్తూ తామిచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తున్నట్లుగా తేల్చేసింది.

అప్పుడ‌ప్పుడు వార్నింగ్ లు ఇచ్చినా.. ఆర్థిక సాయాన్ని ఇచ్చేసే అగ్ర‌రాజ్యం ఈసారి అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. నిధుల్ని నిలిపివేయ‌టంతో పాక్ కు మంట పుట్టింది. అంతే.. ఇంత‌వ‌ర‌కూ అగ్ర‌రాజ్యానికి అణుకువుగా ఉండే దాయాది.. ఇప్పుడు నిర‌స‌న స్వ‌రాన్ని వినిపించ‌ట‌మే కాదు.. మీ కోసం మేం ఎన్ని త్యాగాలు చేసినా.. మీ బుద్ది ఇంతేనంటూ పాక్ విదేశాంగ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్‌ చేసిన‌ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా ఆయ‌న వ‌రుస ట్వీట్ల‌లో అమెరికా తీరును తీవ్ర‌స్థాయిలో ఎండ‌గ‌ట్ట‌టం గ‌మ‌నార్హం.

అమెరికాను గుడ్డిగా నమ్మొద్ద‌ని చ‌రిత్ర త‌మ‌కు చెబుతోంద‌ని పాక్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. త‌మ బ‌ల‌గాలు అసాధార‌ణ యుద్ధం చేశాయ‌ని.. వారు చేసిన త్యాగాల‌కు అంతే లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ అమెరికా సంతోషంగా లేక‌పోవ‌టం బాధాక‌ర‌మ‌న్నారు.

త‌మ దేశ గౌర‌వం విష‌యంలో రాజీ ప‌డేది లేద‌న్న ఆయ‌న‌.. మేం మీకేం చేశామ‌ని అడుగుతున్నారు? మా దేశంలోని స్థావ‌రాల నుంచి అఫ్గానిస్థాన్ పై 57,800 సార్లు దాడులు చేశారు. మీరు చేసిన యుద్ధం వ‌ల్ల వేలాది మంది పాక్ పౌరులు.. సైనికులు బాధితులుగా మారారు.

అబ‌ద్ధాలు.. మోసం త‌ప్ప మీరు మాకేం చేసింది లేద‌ని తేల్చేశారు. 9/11 ఉగ్రదాడుల అనంత‌రం ఒక్క ఫోన్ కాల్ తో నాటి పాక్ పాల‌కుడు అమెరికాకు దాసోహం కావ‌టంతో దారుణ‌మైన ర‌క్త‌పాతంలో తాము భాగ‌స్వామ్యులం అయిన‌ట్లుగా పేర్కొన్నారు. పాక్ విదేశాంగ మంత్రి తాజా వ్యాఖ్య‌లు చూస్తే.. పాక్ పూర్వ అధ్య‌క్షుడు ముషార‌ఫ్ ను ప‌రోక్షంగా విమ‌ర్శించారు. పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారిందంటూ ట్రంప్ చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆ దేశంపై చ‌ర్య‌ల‌కు శ్వేత‌సౌధం సిద్ధ‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌పై ప్ర‌భావం చూపిస్తాయ‌ని చెబుతున్నారు. అమెరికా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా ధీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు పాక్ ఆర్మీ పేర్కొంది. దేశ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల కోసం తాము స్పందిస్తామ‌ని పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి.. ఆర్మీ చేసిన వ్యాఖ్య‌ల‌పై అగ్ర‌రాజ్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.