Begin typing your search above and press return to search.

టీడీపీకి డ‌బుల్ షాక్‌..తాజా మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి

By:  Tupaki Desk   |   5 Feb 2019 3:22 PM IST
టీడీపీకి డ‌బుల్ షాక్‌..తాజా మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి
X
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఒకే రోజు రెండు షాక్‌ లు త‌గల‌డం దాదాపుగా ఖాయ‌మైంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే - మ‌రో మాజీ ఎమ్మెల్యే టీడీపీని వీడ‌టం ఖ‌రారైంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రైన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైంది. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆమంచి - వైసీపీలో చేరాలని భావిస్తున్నారు. ఇవాళ ఈ విషయంపై చర్చించేందుకు వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచితో జనసేన - వైసీపీ టచ్ లో ఉన్నారు. అయితే కృష్ణమోహన్ ఈరోజు సాయంత్రం లేదా రేపు జగన్‌ ని కలిసే అవకాశం ఉందని స‌మాచారం.

మ‌రోవైపు - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ ను ఆయ‌న సొంత జిల్లాలోనే దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి అదే జిల్లాలో ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మైంది. కడప జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుందని తెలుస్తోంది. మాజీమంత్రి - టీడీపీ సీనియర్ నేత ఖలీల్ బాషా గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. పార్టీపై కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న ఖలీల్ బాషా - సాయంత్రంలోపు లోటస్ పాండ్‌ లో జగన్‌ ను కలవనున్నారు. కడప నుంచి వైసీపీ ఎమ్మెల్యే అంజద్ భాషతో కలిసి ఖలీల్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. 7న కడపలో జరిగే శంఖారావం సభలో అధికారికంగా వైసీపీలో చేరనున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా, అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన క‌డ‌ప జిల్లా ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి ఇప్ప‌టికే త‌న ప‌ద‌వికి గుడ్‌ బై చెప్పి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీ మారుతున్న స‌మ‌యంలో ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు కూడా!. తాజా ప‌రిణామంలో మ‌రో ముఖ్య‌నేత పార్టీని వీడుతుండ‌టం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేష‌కులు భావిస్తున్నారు.