Begin typing your search above and press return to search.

ఖైరతాబాద్ వినాయకుడ్ని కర్టెన్ తో కప్పేశారు.. ఎవరంటే?

By:  Tupaki Desk   |   23 Aug 2020 7:10 AM GMT
ఖైరతాబాద్ వినాయకుడ్ని కర్టెన్ తో కప్పేశారు.. ఎవరంటే?
X
వినాయకచవితి వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ హడావుడే వేరుగా ఉంటుంది. పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేయటంతో పాటు.. నవరాత్రులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించటంతో వాతావరణం మొత్తం సందడిగా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మండపాలు ఏర్పాటు చేసినా.. ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసే భారీ వినాయకుడు సో స్పెషల్ అన్నది తెలిసిందే. సామాన్యులు మొదలు వీవీఐపీల వరకు ఇక్కడకు వస్తుంటారు.

ఇదిలా ఉంటే.. కరోనానేపథ్యంలో ఈసారి తొమ్మిది అడుగుల విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. దశాబ్దాల తర్వాత ఇంత చిన్న వినాయకుడ్ని ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. దీంతో.. ఇంత చిన్న వినాయకుడ్ని చూసేందుకు ఖైరతాబాద్ కు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన నిర్వాహకులు.. ఆన్ లైన్ లో దర్శించుకునేఅవకాశాన్ని కల్పించారు. అయినప్పటికీ.. నేరుగా చూడటానికే ఎక్కువమంది భక్తులు ఇష్టపడుతున్నారు.

దీంతో.. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఖైరతాబాద్ వినాయకుడ్ని చూసేందుకు భారీగా పోటెత్తుతున్నారు. దీంతో.. అక్కడి పరిసరాలన్ని బిజీబిజీగా మారాయి. కరోనా వేళ.. ఇలాంటి పరిస్థితి ఏ మాత్రం మంచిది కాదన్న భావనతో పోలీసులు స్పందించారు. ఖైరతాబాద్ వినాయక విగ్రహం కనిపించకుండా ఉండేలా.. నిలువెత్తు కర్టెన్ ను ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే తాము పని చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో.. ఖైరతాబాద్ వినాయకుడ్ని చూద్దామని వస్తున్న భక్తులకు.. విగ్రహం కనిపించక.. కర్టెన్ దర్శనమివ్వటం నిరాశకు గురి చేస్తుంది. అయితే..కరోనా నేపథ్యంలో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.