Begin typing your search above and press return to search.

ప్రసాదం కోసం వెళ్లి తన్నించుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   2 Oct 2015 6:32 AM GMT
ప్రసాదం కోసం వెళ్లి తన్నించుకోవాల్సిందేనా?
X
పుణ్యం కోసం పూజ చేస్తుంటారు. చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవటానికి.. పెద్ద మనసుతో క్షమించి తమకు పాపం రాకుండా చేసి.. పుణ్యం ప్రసాదించాలన్న ప్రార్థన కనిపిస్తుంటుంది. ఏ పుణ్య కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారో.. దాన్ని వదిలేసి మరింత పాపం చేయటం ఎంతవరకు ధర్మం.చేసిన తప్పులకు పరిహారంగా భగవంతుడ్ని ఆశ్రయించే భక్తులు.. దేవాలయం దగ్గరకు వెళ్లి.. వీవీఐపీ ట్రీట్ మెంట్లు.. తమకు మరిన్ని సౌకర్యాల కోసం పడే తాపత్రయం తెలిసిందే.

ఇదో రకమైతే.. దేవుడి దర్శనం కోసం వెళ్లే వారు త్వరగా దేవుడ్ని దర్శించుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. దేవుడ్ని దర్శించుకునేందుకు సమయం లేకపోతే.. తన దగ్గరకు రావాలని దేవుడు అడగలేదు కదా. అలాంటప్పుడు ఈ హడావుడి ఏమిటో అర్థం కాదు. ఇక.. దేవుడి దర్శనం దగ్గర కూడా స్వార్థం కనిపిస్తుంటుంది. ‘‘తన’’ గురించి మాత్రమే ఆలోచించే భక్తులు.. తనకే ఎక్కువ సేపు దర్శనం జరగాలని.. తనకే ఎక్కువ ప్రసాదం లభించాలని ఆత్రుత పడుతుంటారు.

ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. తాజాగా వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్ చేతిలో ఉంచిన భారీ లడ్డూ ప్రసాదాన్ని ఈ ఉదయం నుంచి పంపిణీ చేస్తామని నిర్వహాకులు ప్రకటించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారితో పాటు.. పలు జిల్లాల నుంచి సైతం భక్తులు భారీగా చేరుకున్న పరిస్థితి. ప్రసాదాన్ని చేజిక్కించుకోవటం కోసం శుక్రవారం ఉదయానికే ఖైరతాబాద్ చేరుకున్నారు.

దాదాపు నాలుగు వేల కేజీల లడ్డూ ప్రసాదాన్ని పంచేందుకు వేలాదిమంది భక్తులు బారులు తీస్తారన్న విషయం తెలియంది కాదు. అయినా.. నిర్వాహకులు సరైన ఏర్పాటు చేయకపోవటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. లడ్డూ ప్రసాదం కోసం భక్తుల ఆరాటం ఒక స్థాయిలో హద్దులు దాటిపోవటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

దీంతో దేవుడి ప్రసాదం కోసం భక్తులకు లాఠీ దెబ్బలే ప్రసాదంగా మారాయి. దీనికి తోడు ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయకపోవటం.. కొంతమందికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటంతో బారులు తీరిన భక్తులు విపరీతమైన అసంతృప్తికి గురయ్యారు. లాఠీఛార్జ్ నేపథ్యంలో ఉద్రిక్త చోటు చేసుకోవటం.. భక్తుల నుంచి నిరసన వ్యక్తం కావటంతో లడ్డూ ప్రసాద పంపిణీని కాసేపు నిలిపివేసి.. మళ్లీ పంపిణీ చేయటం ప్రారంభించారు. ఏమైనా.. ప్రసాదం కోసం లాఠీ దెబ్బలు తినాల్సిన అవసరం ఉందా..?