Begin typing your search above and press return to search.

అరవైఏళ్ల తర్వాత మళ్లీ.. ఖైరతాబాద్ గణపతి అలా

By:  Tupaki Desk   |   22 Aug 2020 4:40 PM IST
అరవైఏళ్ల తర్వాత మళ్లీ.. ఖైరతాబాద్ గణపతి అలా
X
వినాయకచవితి వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నింటికి గురించి అదే పనిగా చర్చ జరుగుతుంటుంది. రెండురాష్ట్రాల్లో ఎవరెన్ని విగ్రహాలు పెట్టినా.. ఖైరతాబాద్ విగ్రహం ముందు దిగదుడుపే. అదే సమయంలో.. నిమజ్జనం వేళ.. బాలాపూర్ లడ్డూ వేలానికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రపంచాన్ని స్తంభించిపోయేలా చేసిన కరోనా పుణ్యమా అని.. దాదాపు అరవైఏళ్ల తర్వాత.. ఖైరతాబాద్ వినాయకుడి స్వరూపం మారిపోయింది.

1954లో ఒక్క అడుగు విగ్రహంతో మొదలైన ఖైరతాబాద్ గణేషుడు.. కాలక్రమంలో 62 అడుగుల ఎత్తువరకు ఎదిగాడు. ఆరున్నర దశాబ్దాలుగా భక్తులకు కొంగుబంగారంగా కొలిచే ఈ గణపతిని ఈసారి అందుకు భిన్నంగా సిద్ధం చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి తొమ్మిది అడుగులకు ఖైరతాబాద్ వినాయకుడ్ని పరిమితం చేశారు. వినాయకచవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకోవటానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చేవారు.

తాజాగా మారిన పరిస్థితులకు అనుగుణంగా తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన భాగ్యనగర ఉత్సవ సమితి.. ఆన్ లైన్ లోనే పూజలు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేవటం గమనార్హం. కోవిడ్ అంతు చూస్తానన్నట్లుగా ఖైరతాబాద్ మహాగణపతిని ఈసారి ధన్వంతరి మహాగణపతిగా తీర్చిదిద్దారు. భారీతనం విషయంలో చాలా తేడా వచ్చినా.. ఆ లోటు కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

కరోనా నేపథ్యంలో సామూహిక దర్శనాలు.. పూజలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సరికొత్త దర్శన ఏర్పాట్లను చేపట్టింది. దర్శనం కోసం ఖైరతాబాద్ కు రావొద్దని.. ఆన్ లైన్ లో గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే.. పూజలు చేస్తామన్నారు. స్థానికులు మాత్రం భౌతిక దూరాన్ని పాటిస్తూ.. దర్శనం చేసుకోవాలన్నారు. ఇక్కడ పదకొండు రోజుల పాటు ఉత్సవాల్ని నిర్వహించి.. నిమజ్జనం చేయనున్నారు.