Begin typing your search above and press return to search.

ఛీఎఫ్ సీ చికెన్..

By:  Tupaki Desk   |   27 Jun 2015 3:27 PM IST
ఛీఎఫ్ సీ చికెన్..
X
భోజన ప్రియుల స్వర్గధామం కేఎఫ్‌సీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇంతకాలం కేఎఫ్ సీలో తిన్నవారు అసహ్యించుకునేలా కొత్తకొత్త సంగతులు తెలుస్తున్నాయి. తాజాగా అమెరికా దిగుమతి అయిన కెఎఫ్‌సీ చికెన్‌లో హానికరమైన బ్యాక్టీరియాలున్నట్లు తేలింది. కేఎఫ్‌సీ ఫుడ్‌పై బాలల హక్కుల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ.. హైదరాబాద్‌లోని ఐదు కేఎఫ్ సీ అవుట్‌లెట్స్ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపింది. అందులో ఈ కోలీ, సాల్మనెల్లా వంటి బ్యాక్టీరియా ఉన్నట్లు తేల్చారు. సాధారణంగా ఇవి విసర్జకాల్లో ఉంటాయని.. కానీ, ఆహారపదర్థాల్లోనూ ఉండడం ఆశ్చర్యకరమని చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని.. వ్యాధులకారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. జంట నగరాల్లోని హిమాయత్ నగర్, విద్యానగర్, చిక్కడపల్లి, నాచారం, ఈసీఐఎల్ క్రాస్ రోడ్డుల్లోని కేఎఫ్‌సీ షాపుల నుంచి ఈ నమూనాలు సేకరించారు.

అయితే... కేఎఫ్ సీ మాత్రం తమ ఆహార పదార్థాలపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతోంది. తమ ఉత్పత్తులన్నీ సురక్షితమని చెబుతుండడమే కాకుండా తమ వద్ద నుంచి తీసుకెళ్లిన నమూనాలను సరిగ్గా ఉంచకపోవడం వల్ల పరీక్ష జరిపేలోగా అవి పాడయ్యుంటాయని... అందుకే అందులో బ్యాక్టీరియా ఫార్మ్ అయ్యి ఉండొచ్చని వాదిస్తోంది. తమపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలనీ చెబుతోంది.