Begin typing your search above and press return to search.

అగ్నిపథ్ పై త్రివిధ దళాల కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   19 Jun 2022 2:30 PM GMT
అగ్నిపథ్ పై త్రివిధ దళాల కీలక ప్రకటన
X
అగ్నిపథ్ నియామక విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ త్రివిధ దళాల ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ పై త్రివిధ దళాలు కీలక ప్రకటన చేశాయి. త్రివిధ దళాల్లో ఇకపై రెగ్యులర్ నియామకాలు ఉండవని.. కేవలం అగ్నిపథ్ పథకం ద్వారా నియామకాలు జరుగుతాయని రక్షణ శాఖ అడిషనల్ సెక్రటరీ, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టం చేశారు. గతంలో రెండు పరీక్షలు పూర్తి చేసుకున్న వారు కూడా అగ్నిపథ్ పథకంలో చేరాల్సిందేనని తేల్చిచెప్పారు. అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. త్రివిధ దలాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సంస్కరణ ద్వారా యువత, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఆర్మీని సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సైన్యం సగటు వయసు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. కార్గిల్ రివ్యూ కమిటీ సైతం దీని గురించి ప్రస్తావించిందని గుర్తు చేశారు. ఈ సంస్కరణ చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉందని రక్షణ శాఖ అడిషనల్ సెక్రటరీ తెలిపారు.

అగ్నివీరులకు వివిధ మంత్రిత్వశాఖల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు వచ్చిన ప్రకటనలు.. నిరసనలు వల్ల కాదని పూరి స్పష్టం చేశారు. ఇదంతా ముందస్తు ప్రణాళికల్లో భాగమేనని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అగ్నిపథ్ విధానాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

పథకం పనితీరును అంచనావేయడం సహా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తొలుత 46వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు వివరించారు. వచ్చే నాలుగైదేళ్లలో రిక్రూట్ మెంట్ సంఖ్య 60వేల వరకూ ఉంటుందన్నారు. దీన్ని క్రమంగా 90వేల నుంచి లక్ష వరకూ పెంచుతామన్నారు. సమీప భవిష్యత్తులోనే ఇది 1.25 లక్షల వరకూ పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 46వేల మందిని తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్ నియామకాలు ఇదే స్థాయిలో మాత్రం ఉండవన్నారు. దేశ సేవలో అమరులైతే అగ్నివీరుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందుతుందన్నారు. కేవలం అగ్నిపథ్ వల్లే ఆర్మీ ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారనే వాదన సరికాదని తెలిపారు.

నిరసనలు చేస్తున్న వారికి లెఫ్టినెంట్ జనరల్ షాక్ ఇచ్చారు. విధ్వంసానికి పాల్పడే వారిని ఆర్మీలో చేర్చుకునేది లేదని తేల్చిచెప్పారు. హింసాత్మక ఆందోళనలను తాము ఊహించలేదన్న ఆయన ఆర్మీలో క్రమశిక్షణారాహిత్యానికి తావులేదని స్పష్టం చేశారు.