Begin typing your search above and press return to search.

నిన్నటి నుంచి ఇప్పటిదాకా అన్నాడీఎంకే లో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   8 Feb 2017 10:20 AM GMT
నిన్నటి నుంచి ఇప్పటిదాకా అన్నాడీఎంకే లో ఏం జరిగింది?
X
మూడు రోజుల్లో మొత్తం మారిపోయింది. నిన్నటి వరకూ క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న అన్నాడీఎంకే వ్యవహారం ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. విధేయతకు మారుపేరుగా ఉన్న పన్నీర్ సెల్వం నోరు నిప్పులు చెరుగుతుంటే.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టి.. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని తలచిన చిన్నమ్మ శశికళ వైపు అందరూ వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి. మొత్తంగా.. మూడు రోజుల వ్యవధిలో తమిళనాడు రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకోవటమే కాదు.. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్న పరిస్థితి.

ఆదివారం అన్నాడీఎంకే శాసన సభాపక్ష సమావేశం నిర్వహించటం.. చిన్నమ్మను శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావటం.. ఆ వెంటనే సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేయటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. సోమవారం.. పన్నీర్ రాజీనామాను గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదించారు. మరోవైపు మంగళవారం ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు చిన్నమ్మ సిద్ధం కావటమేకాదు.. ప్రమాణస్వీకారోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను మొదలెట్టారు.

ఇంకోవైపు.. చిన్నమ్మపై ఉన్న అక్రమాస్తుల కేసు తీర్పును మరో వారం వ్యవధిలో తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీం వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ప్రమాణస్వీకారం చేయించాల్సిన గవర్నర్ చెన్నైకి రాకపోవటం.. కేసుల తీర్పు తేలిన తర్వాత పదవీ బాధ్యతల్ని స్వీకరించాలన్న సమాచారాన్ని ఇవ్వటంతో ప్రమాణ స్వీకారోత్సవం కోసం జరుగుతున్న ఏర్పాట్లను నిలిపేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు చిన్నమ్మ ప్రయత్నాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఆమెపై పలువురు కామెంట్లు చేయటం కనిపించింది. మరోవైపు.. అమ్మది అనుమానాస్పద మరణం కాదన్న విషయాన్ని తేల్చి చెబుతూ అమ్మకు వైద్యం చేసిన డాక్టర్ల బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఉన్నట్లుండి అపోలో వైద్యుల చేత ప్రెస్ మీట్ పెట్టించాల్సిన అవసరం ఏముందన్న చర్చ నడుస్తున్న వేళ.. వీరపాండ్యన్ చిన్నమ్మపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. అమ్మ మరణంపై అనుమానాలు ఉన్నాయన్నారు. పోయెస్ గార్డెన్ లో అమ్మను నెట్టేశారని.. కిందపడి తీవ్ర గాయాలు అయ్యాక ఆసుపత్రికి తరలించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

మరోవైపు.. చిన్నమ్మ తీరుపై పన్నీరు సెల్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దాదాపు 35 మందికి పైగా ఎమ్మెల్యేలు పన్నీర్ పక్షాన ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. పన్నీర్ అసంతృప్తి నిజమేనన్న విషయాన్ని నిజం చేస్తూ మంగళవారం రాత్రి ఒంటరిగా మెరీనా బీచ్ వద్దకు వెళ్లిన పన్నీర్ సెల్వం.. అమ్మ సమాధి వద్ద కూర్చొని చాలాసేపు ఉండిపోయారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ శశికళ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తనను బలవంతంగా సీఎం పదవి నుంచి రాజీనామా చేశారని.. అమ్మ ఆత్మ తనతో మాట్లాడిందని.. అన్ని విషయాలు చెప్పమందంటూ నాటకీయంగా మాట్లాడిన పన్నీర్ మాటలు సంచలనంగా మారాయి. ఆసుపత్రిలో చికిత్స సందర్భంగా.. తన తర్వాత తనను ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాల్సిందిగా అమ్మ తనకు చెప్పారన్నారు. ఈ సందర్భంగా శశికళ మీద విమర్శలు చేశారు. పన్నీర్ పక్షాన 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

ఊహించని ఈ పరిణామం శశికళకు షాకింగ్ గా మారింది. అత్యవసరంగా పార్టీ నేతలతో సమావేశమైన ఆమె.. పన్నీర్ సెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పన్నీర్ పై విమర్శలు చేశారు. మరోవైపు.. పన్నీర్ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సాయం చేస్తామని డీఎంకే వర్గాలు వెల్లడించాయి.

బుధవారం ఉదయం మరోసారి చిన్నమ్మపై తీవ్ర విమర్శలు ఆరోపణల్ని సంధించారు పన్నీర్ సెల్వం. 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అమ్మను చూసేందుకు తనను సైతం అనుమతించలేదన్నారు. ఈ విషయంపై తాను కూడా బలవంతం పెట్టలేదన్న ఆయన.. అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తం చేయటంతో పాటు.. తాను పార్టీకి విధేయుడినని.. తనను కోశాధికారి పదవి నుంచి ఎవరూ తప్పించలేరన్నారు. శశికళ పార్టీ తాత్కాలిక ప్రదాన కార్యదర్శి మాత్రమేనని.. త్వరలోనే శాశ్విత ప్రధాన కార్యదర్శిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటామన్నారు. అమ్మ మరణం మీద అనుమానాలు ఉన్నాయని.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్న ఆయన.. సీఎం పదవికి తాను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకునే అవకాశం వస్తే తీసుకుంటానని స్పష్టం చేశారు.

తన వెనుక ఎవరూ లేరన్న పన్నీర్.. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పన్నీర్ నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. అమ్మ మేనకోడలు దీప తనకు మద్దతు ఇస్తే తీసుకుంటామని.. ఆమె కలిసి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. చెన్నైకి గవర్నర్ వస్తే నేరుగా ఆయన్నుకలిసి పరిస్థితి వివరిస్తానని చెప్పిన ఆయన.. తమిళనాడు వ్యాప్తంగా అన్నిప్రాంతాలకు తిరిగి జరిగింది ప్రజలకు వివరిస్తానన్నారు. పార్టీకి తాను ఎప్పుడూ ద్రోహం చేయనని.. పార్టీకి వ్యతిరేకంగా తానెప్పుడు మాట్లాడలేదని చెప్పారు.

ఇదిలా ఉంటే.. పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడిన కాసేపటికి అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి చిన్నమ్మ చేరుకున్నారు. అమ్మ మాదిరే అభివాదం చేసుకుంటూ కార్యాలయానికి వెళ్లిన ఆమె.. ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. చిన్నమ్మతో సమావేశానికి ఏకంగా 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు హాజరు కావటం గమనార్హం. అమ్మ బాటలో నడుద్దామని చెప్పిన ఆమె.. పార్టీ బాధ్యతలు స్వీకరించమని చెప్పినా అమ్మ పోయిన బాధలో తాను వారించినట్లుగా వెల్లడించారు. పన్నీర్ సెల్వం వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని.. 48గంటల్లో ఆయన మాట మార్చినట్లుగా విమర్శించారు. పన్నీర్ ను ద్రోహిగా.. మోసకారిగా చిన్నమ్మ మండిపడ్డారు. ప్రస్తుత సంక్షోభం వెనుక డీఎంకే ఉందని.. అన్నాడీఎంకే కంచుకోటగా అభివర్ణించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. అన్నాడీఎంకే అంతా ఐక్యంగా ఉందని.. తామేమీ రహస్యంగా సమావేశాన్ని నిర్వహించలేదని.. తాజా సంక్షోభం వెనుక డీఎంకే ఉందన్నారు. పన్నీర్ వెనుక ఎవరు ఉన్నారో తమిళ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరారు. పార్టీకి వ్యతిరేకంగా చేసే పనులు పనికిరావని.. డ్రామాలు టీవీలకు పనికి వస్తాయి కానీ పార్టీకి కాదని ఫైర్ అయ్యారు.

అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిణామాలపై విపక్షం డీఎంకే స్పందించింది. వారి అంతర్గత అంశాలపై తాము జోక్యం చేసుకోమని.. కాకుంటే అమ్మ మరణంపై వెల్లువెత్తుతున్న సందేహాలకు శశికళ సమాధానాలు ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలపై తాము జోక్యం చేసుకోమని.. తమకు ఆ అవసరం లేదని కేంద్రమంత్రి.. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తాజా పరిణామాలు మరో అడుగు ముందుకు పడాలంటే చెన్నైకి గవర్నర్ రావటమో లేదంటే.. పన్నీర్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా బయటకు వస్తే.. తమిళనాడు రాజకీయాలు మరింత రసకందాయంలో పడే వీలుందని చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/