Begin typing your search above and press return to search.

ఆఖరి విడత పోటీలో కీలక నేతలు - ప్రముఖులు!

By:  Tupaki Desk   |   18 May 2019 12:15 PM IST
ఆఖరి విడత పోటీలో కీలక నేతలు - ప్రముఖులు!
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీలో ఉన్న వారణాసిలో పోలింగ్ జరగబోతూ ఉండటం లోక్ సభ సార్వత్రికలకు సంబంధించిన కీలకమైన అంశం. గత ఎన్నికల్లో వారణాసి నుంచి భారీ మెజారిటీలో మోడీ ఎంపీగా నెగ్గారు. మరోసారి ఆ నియోజకవర్గం నుంచినే ఆయన పోటీ చేశారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన మోడీ ఈ సారి మాత్రం ఒక చోట మాత్రమే పోటీ చేస్తూ ఉన్నారు. దీంతో వారణాసిలో విజయమే ఆయనకు కీలకం కానుంది.

కానీ మోడీకి అక్కడ బలమైన ప్రత్యర్థి లేనట్టే. కాబట్టి విజయం నల్లేరు మీద నడక కాగలదు. ఈ ఆదివారం ఆఖరి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో మరి కొంతమంది ప్రముఖులు కూడా పోటీలో ఉన్నారు వారిలో శత్రుఘ్న సిన్హా - రవి కిషన్ వంటి సినీ నటుడు ఉండటం గమనార్హం.

తొలిసారి కాంగ్రెస్ టికెట్ మీద బరిలోకి దిగుతున్నారు శత్రుఘ్న సిన్హా. ఆయన ఇన్నేళ్లూ భారతీయ జనతా పార్టీ నేతగా కొనసాగారు. బీజేపీ తరఫున వరసగా పట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి నెగ్గారు. అయితే కొన్నాళ్లుగా ఆయన బీజేపీలో ఇమడలేకపోయారు. అసంతృప్త నేతగా కొనసాగారు. ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆయనకు పోటీగా కమలం పార్టీ వారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ను బరిలోకి దించారు. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.

ఇక పలు తెలుగు సినిమాల్లో కూడా విలన్ గా అదరగొట్టిన భోజ్ పురి స్టార్ హీరో రవి కిషన్ ఇటీవలే బీజేపీలో చేరి గోరఖ్ పూర్ టికెట్ పొందిన సంగతి తెలిసిందే. గోరక్ పూర్ భారతీయ జనతా పార్టీకి మొన్నటి వరకూ అనుకూల నియోజకవర్గమే. అయితే ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేనట్టుగా ఉంది వ్యవహారం.

ఇక మరో బాలీవుడ్ నటి కిరణ్ ఖేర్ పోటీలో ఉన్న చంఢీగడ్ కు కూడా ఆఖరి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఆమె బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆమెకు పోటీగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ను పోటీకి దించారు. గత ఎన్నికలప్పుడు కిరణ్ ఖేర్ కు సహకరించిన వారు ఇప్పుడు ఆప్ లోకి చేరిపోవడంతో ఆమె నెగ్గుతుందా అనేది సందేహంగానే మారిందని విశ్లేషకులు అంటున్నారు.