Begin typing your search above and press return to search.

రేపు నాలుగోవిడత.. బరిలో హేమాహేమీలు

By:  Tupaki Desk   |   28 April 2019 6:31 AM GMT
రేపు నాలుగోవిడత.. బరిలో హేమాహేమీలు
X
ఎన్నడూ లేని విధంగా ఈసారి దేశంలో అతిపెద్ద పోలింగ్ కు ఈసీ సమాయత్తమైంది. ఏడు విడతల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. శనివారం నాటితో ప్రచారం నాలుగో విడత ప్రచారానికి ముగింపు పడింది. సోమవారం పోలింగ్ పై అన్ని పార్టీల నేతలు దృష్టి సారించారు.

నాలుగో విడతలో మొత్తం 9 రాష్ట్రాల్లోని 72 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 961మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. లక్షా 40వేల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 12 కోట్ల 79లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

కాగా మూడు దశాల్లో ఇప్పటికే దేశంలో విజయవంతంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు నాలుగోవిడతకు రంగం సిద్ధం చేసింది. నాలుగోవిడత కోసం సోమవారం దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశారు.

పశ్చిమ బెంగాల్ లో 8 - ఒడిషాలో 6 - మధ్యప్రదేశ్ లో 6 - బీహార్ 5 - జార్ఖండ్ లో 3 - జమ్మూకాశ్మీర్ లో 1 - మహారాష్ట్రలో 17 - రాజస్థాన్ లో 13 - ఉత్తరప్రదేశ్ లో 13 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

నాలుగో విడతలో పలు కీలక నియోజకవర్గాలున్నాయి. మహారాష్ట్రలోని ఉత్తర ముంబై - దక్షిణ ముంబై - ఉత్తర మధ్య ముంబై - రాజస్థాన్ లోని జలవర్ బరాన్ - జోధ్ పూర్ - బాడ్మేర్ - యూపీలోని ఉన్నావ్ - కన్నౌజ్ - పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్.. మధ్యప్రదేశ్ లోని చింద్వాడ - సిధీ - జబల్ పూర్ సెగ్మెంట్లు ఉన్నాయి.

ఇక నాలుగోవిడతలో రాజకీయ ప్రముఖులు బరిలో నిలిచారు. చింద్వాడ నుంచి ఎంపీ సీఎం కమల్ నాథ్ కొడుకు నకుల్ - జబల్ పూర్ నుంచి బీజేపీ నేత రాకేష్ సింగ్ - సిధీ నుంచి కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ తలపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ దత్ కూతురు ప్రియాంకదత్ - బాలీవుడ్ నటి ఉర్మిళ - బీజేపీ నేత పూనమ్ మహాజన్ ఎంపీలుగా పోటీచేస్తున్నారు. ఇక సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ జోధ్ పూర్ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ గజేంద్రసింగ్ షెకావత్ తో వైభవ్ పోటీపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్ పోల్ నుంచి బీజేపీ లీడర్ బాబుల్ సుప్రియో పోటీచేస్తున్నారు.