Begin typing your search above and press return to search.

పినరయి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ .. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం

By:  Tupaki Desk   |   17 April 2021 5:30 AM GMT
పినరయి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ .. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం
X
సీఎం పినరయి విజయన్ ఆద్వర్యంలోని లోని కేరళ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితులపై ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒత్తిడి చేసినట్లు నమోదైన రెండు కేసులను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. సీఎంకి వ్యతిరేకంగా నేరాన్ని అంగీకరించాలని అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు ఈ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ ఈడీ హైకోర్టు మెట్లు ఎక్కింది. తమ శాఖ అధికారులపై నమోదైన కేసులను రద్దు చేయాలని, లేదా, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఈడీ కోరింది.

కేరళ పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు ఓ ప్రహసనమని ఆరోపణలు చేసింది. కేరళ పోలీసులు గత నెలలో ఈడీ అధికారులపై రెండు కేసులను నమోదు చేశారు. బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ మాట్లాడినట్లు చెప్తున్న ఓ ఆడియో క్లిప్ ఆధారంగా ఓ కేసును, మరొక నిందితుడు జిల్లా కోర్టుకు రాసిన లేఖ ఆధారంగా మరొ కేసు నమోదు చేశారు. స్వప్న సురేశ్‌ను ఈడీ అధికారులు 2020 ఆగస్టు 12, 13 తేదీల్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమెపై ఈడీ అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు ఈ ఆడియో క్లిప్‌లో వినిపించింది. మరొక నిందితుడు సందీప్ నాయర్ ఎర్నాకుళం జిల్లా కోర్టుకు లేఖ రాశారు. బంగారం అక్రమ రవాణా కేసులో ముఖ్యమంత్రి విజయన్ పేరు చెప్పాలని తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. వీరిద్దరి ఆరోపణలపైనా కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 120బీ, 167 , 192, 195-ఏ ప్రకారం ఈడీ అధికారులపై కేసులు నమోదు చేశారు.స్వప్న సురేశ్ కేరళలోని యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగిని. 30 కేజీల బంగారం అక్రమ రవాణా కేసులో ఆమె నిందితురాలు. ఈ బంగారం విలువ రూ.14.82 కోట్లు ఉంటుంది. ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసును ఈడీ, కస్టమ్స్, ఎన్ ఐ ఏ దర్యాప్తు చేస్తున్నాయి.