Begin typing your search above and press return to search.

ఓటుకు నోటులో ఏసీబీ వద్ద కీలక ఆధారాలు

By:  Tupaki Desk   |   28 Oct 2020 12:20 PM IST
ఓటుకు నోటులో ఏసీబీ వద్ద కీలక ఆధారాలు
X
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో పెద్ద తలకాయలు ఏసీబీ చేతికి చిక్కాయి. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ లాంటి వారు అరెస్ట్ కాగా.. ఎమ్మెల్యే సండ్ర, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అయితే రాజకీయంగా సంచలనమైన ఈ కేసు మధ్యలో నీరుగారిపోయిందన్న వదంతులు వ్యాపించాయి. ఈ కేసు కనుక నిరూపితమైతే బిగ్ షాట్స్ జైలుకు వెళుతారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగింది.

సుప్రీంకోర్టు తీర్పుతో నేతలపై కేసులు ఫాస్ట్ కోర్టుల్లో విచారణలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటుకు నోటు కేసు కూడా ఇటీవల మళ్లీ విచారణ ఊపందుకుంది.

తాజాగా ఏసీబీ స్పెషల్ పీపీ సురేందర్ రావు ప్రత్యేక కోర్టుకు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లను కొట్టివేయాలని నివేదించారు. ఓటుకు నోటు కేసును నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. వారి పిటీషన్లను కొట్టివేయాలని కోర్టును కోరారు.

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ఓటు కోసం ప్రలోభపెట్టిన కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటీషన్లను ఏసీబీ కోర్టు మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా ఏసీబీ తరుఫున వాదించిన పీపీ ఈ కుట్రలో నిందితుల పాత్ర ఉందనేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసి వీరంతా కుట్రలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు.

శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఓటుకు నోటు కుట్రపై రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని.. ఫోన్ కాల్స్, వాయిస్ కాల్స్ లోనూ సండ్ర ప్రమేయం స్పష్టంగా ఉన్నదని ఏసీబీ పేర్కొంది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని వివరించింది.

రేవంత్ రెడ్డి అనుచరుడు ఉదయసింహ కూడా ఈ కేసులో కీలకమని.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చేందుకు రూ.50 లక్షలను ఉదయసింహనే తీసుకొచ్చారని ఏసీబీ వాదించింది. డబ్బును ఎక్కడి నుంచి తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి స్వయంగా ఉదయసింహకు చెప్పారని స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. వేం కృష్ణకీర్తన్ రెడ్డి నుంచి ఉదయసింహ ద్వారా రూ.50 లక్షలను రేవంత్ రెడ్డి తెప్పించారని ఏసీబీ పేర్కొంది.

ఓటుకు కోట్లు కేసు నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జు పిటీషన్లను కొట్టివేయాలని కోర్టులో ఏసీబీ వాదించింది.

నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లను కొట్టివేసి నిందితులపై అభియోగాలను నమోదు చేయాలని సురేందర్ రావు నివేదించగా.. ఈ కేసులో నిందితుల తరుఫున వాదనలు వినేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.