Begin typing your search above and press return to search.

కేశినేని దుకాణం బంద్?

By:  Tupaki Desk   |   8 April 2017 7:32 AM GMT
కేశినేని దుకాణం బంద్?
X
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బస్సు సర్వీసులకు పేరుగాంచిన కేశినేని ట్రావెల్స్ సంస్థను మూసివేశారు. కేశినేని ట్రావెల్స్ అధినేత, తెలుగుదేశం ఎంపి కేశినేని నాని ఇటీవల కొద్ది కాలంగా తన ట్రావెల్స్ సంస్థను మూసివేస్తామని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పోటీ పెరిగిపోవడం, కుప్ప తెప్పలుగా ట్రావెల్స్ పెరిగిపోవడం కారణంగా సంస్థ నష్టాలలో కూరుకుపోయిందని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. చెప్పినట్లే ఈ రోజు ఉదయం కేశినేని ట్రావెల్స్ సంస్థను మూసివేశారు. బెజవాడలోని ఆ సంస్థ కార్యాలయం వద్ద బోర్డును కూడా తొలగించారు.

కేశినేని ట్రావెల్సును బతికించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా అవి పారకపోవడంతో సంస్థను మూసివేశారు. హఠాత్తుగా ట్రావెల్స్‌ను మూసి వేయడం వెనుక పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. చాలా ఏళ్లుగా కేశినేని ట్రావెల్స్‌ బస్సులు నడుస్తున్నాయి. దాదాపు 450 సర్వీసులను కేశినేని ట్రావెల్స్ నడుపుతోంది. అయితే అర్థరాత్రి నుంచి ట్రావెల్స్‌ను నిలిపివేశారు. విజయవాడతో పాటు ముఖ్యపట్టణాల్లోని కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలను మూసివేశారు.

కొద్దికాలంగా ట్రావెల్స్‌ను నడిపేందుకు కేశినేని సంస్థ ఆపసోపాలు పడుతోంది. కొన్నేళ్లుగా భారీ నష్టాలను మూటకట్టుకుంది. రేటింగ్‌ లోనూ చాలా వెనుకపడిపోయింది. ఒక దశలో ఏడు నెలల జీతాలు రాకపోవడంతో సిబ్బంది ధర్నాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితమే 170 బస్సులను నాని అమ్మేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే అధికార బలాన్ని ఉపయోగించి మిగిలిన ట్రావెల్స్‌ను దెబ్బకొట్టడం ద్వారా కేశినేని ట్రావెల్స్‌కు ఊపిరిపోయాలని నాని భావించారు. ఇందులో భాగంగానే రేటింగ్‌ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆరంజ్‌ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలంటూ విజయవాడ ఆర్‌ టీవో కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై కేశినేని నాని - బోండా ఉమా కలిసి దూసుకువెళ్లారు. అయితే బాలసుబ్రమణ్యంపై దాడి విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవడం, ఆరంజ్ ట్రావెల్స్‌ కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంపీ అనుచరులు ఒత్తిడి తెచ్చారని బాలసుబ్రమణ్యం చెప్పడంతో కేశినేని నాని ఎత్తులు పారలేదు. ఆ సంఘటన తర్వాత కేశినేని ట్రావెల్స్ డొల్లతనంపై మరింత చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో ఇక సర్వీసులను నడపడం సాధ్యం కాదని భావించిన కేశినేని నాని… దాన్ని మూసివేశారు. నిజానికి వారం క్రితమే ట్రావెల్స్‌ మూసివేతపై కేశినేని ప్రకటన చేస్తారని భావించారు. కానీ అప్పుడు చంద్రబాబు ఫోన్ చేసి పిలిపించుకుని ట్రావెల్స్‌ను మూసి వేయవద్దని నానికి సూచించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో నాని చివరకు ట్రావెల్స్‌ ను మూసివేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/