Begin typing your search above and press return to search.

కేవీపీకి నిరాశ త‌ప్ప‌దంటున్న టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   5 Feb 2017 7:30 AM GMT
కేవీపీకి నిరాశ త‌ప్ప‌దంటున్న టీడీపీ ఎంపీ
X
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని మెజార్టీ ప్ర‌జ‌లు ఒక‌వైపు గ‌ళం వినిపిస్తుంటే అధికార తెలుగుదేశం పార్టీ నేత‌లు మాత్రం హోదా అక్క‌ర్లేద‌ని తేల్చేస్తున్నారు. కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి ఇటీవ‌ల అనేక సార్లు ఈ ప్ర‌క‌ట‌న చేయ‌గా తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ వ‌రుస‌లో చేరారు. ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ప్ర‌త్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఇక దీనిపై చర్చ అనవసరమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఆందోళ‌న‌లు చేయిస్తున్న వారు - ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న వారు త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఇలాంటి ప‌నులు చేస్తున్నార‌ని ప‌రోక్షంగా ఏపీ విప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరును నాని దుయ్య‌బ‌ట్టారు. అలాంటి వారికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేద‌ని కేశినేని నాని వ్యాఖ్యానించారు.

ఆంధ్ర‌ప్రదేశ్‌కు స్పెష‌ల్ స్టేట‌స్ కేటాయించాల‌నే అంశాన్ని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్ర‌వేశ‌పెట్టి ప్రైవేట్‌ సభ్యుల బిల్లును కేశినేని నాని తేలిక‌గా తీసిపారేశారు. పార్ల‌మెంటు స‌భ్యులు ప్రైవేటు బిల్లు పెట్టటం సర్వసాధారణమని, అయితే అవేవీ సభ ఆమోదాన్ని పొందేవి కాదని ఎద్దేవా చేశారు. తామేదో చేశామ‌ని చెప్ప‌కోవ‌డం కోసం, రికార్డుల కోసమే ఈ తరహా బిల్లులు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ సిఫార్సులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రత్యేక ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారని కేశినేని నాని వెల్లడించారు. ఇప్పటికే హోదాకు సంబంధించిన అన్ని లాభాలను రాష్ట్రం పొందిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమే లేదని కేశినేని నాని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ద‌క్కాల్సిన వాటి విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని వీటి ద్వారా రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతుంద‌ని కేశినేని నాని ధీమా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/