Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో మ‌రోమారు రెడ్ అల‌ర్ట్.. నాటి వ‌ర్షాల‌ను త‌ల్చుకుని వ‌ణుకు!

By:  Tupaki Desk   |   5 Aug 2022 7:30 AM GMT
ఆ రాష్ట్రంలో మ‌రోమారు రెడ్ అల‌ర్ట్.. నాటి వ‌ర్షాల‌ను త‌ల్చుకుని వ‌ణుకు!
X
కేరళలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం కేరళలోని ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. నదులు పొంగి చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తడంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. 2018లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌ను త‌ల్చుకుని ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. 2018లో వ‌చ్చిన వ‌ర్షాలు కేర‌ళ‌తో పెను విప‌త్తును సృష్టించిన సంగ‌తి తెల‌సిందే. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా త‌లో చేయి వేస్తే కానీ ఆ రాష్ట్రం కుదుట‌ప‌డ‌లేదు. ఇప్పుడు మ‌రోమారు ఆ రేంజులో వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్ , కన్నూర్‌లో రెడ్ అలర్ట్ జారీ చేయగా, తిరువనంతపురం మినహా మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

రాష్ట్రంలోనే అతి పొడవైన నది పెరియార్ పొంగి ప్రవహించి చుట్టుపక్కల గ్రామాలను ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలక్కుడి, పంపా, మణిమాల అచ్చంకోవిల్‌తో సహా ఇతర నదులు ప్రమాద స్థాయికి దగ్గరగా ఉన్నాయి. కొన్ని న‌దులు ప్ర‌మాద‌క‌ర స్థితిని దాటి ప్ర‌వ‌హిస్తున్నాయి.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారుల సూచనల మేరకు చలకుడి నది ఒడ్డున ఉన్న నివాసితులను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. త్రిసూర్, ఎర్నాకుళం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కొండ ప్రాంతాలలో రాత్రిపూట ప్రయాణించడం ముప్పుగా పరిణమించిందని ఆయన తెలిపారు.

ఇడుక్కిలోని పొన్ముడి, లోయర్ పెరియార్, కల్లార్‌కుట్టి, ఎరట్టయార్, కుంటాల, పతనంతిట్ట జిల్లాలోని మూజియార్‌లలో ఆరు ప్రధాన డ్యామ్‌లలో నీటి నిల్వ స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్ప‌టికే 22 మంది మ‌ర‌ణించారు. కేర‌ళ ప్ర‌భుత్వం బాధితుల కోసం 331 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది.

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ‌బరిమ‌ల‌కు భ‌క్తులు వెళ్ల‌కుండా కేర‌ళ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. పంబ తదిత‌ర న‌దులు ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వ‌హిస్తుండ‌టం, చెట్లు విరిగిప‌డ‌టం, కొండ రాళ్లు జారిప‌డ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది.