Begin typing your search above and press return to search.

అమ్మాయిల ముసుగులపై కేరళ ముస్లిం సొసైటీ సంచలనం

By:  Tupaki Desk   |   3 May 2019 12:10 PM IST
అమ్మాయిల ముసుగులపై కేరళ ముస్లిం సొసైటీ సంచలనం
X
కేరళలోని కోజీకోడ్ కేంద్రంగా నడిచే ఎంఈఎస్ అనే ముస్లిం సొసైటీ అమ్మాయిలు ముసుగులు ధరించడంపై సంచలనం నిర్ణయం తీసుకుంది. ఎంఈఎస్ ఆధ్వర్యంలో 150 విద్యాసంస్థల్లో విద్యార్థులు ముసుగులు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు లక్ష మంది విద్యార్థులు ముస్లిం సొసైటీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

సొసైటీ విద్యాసంస్థల్లో గతంలో కొంతమంది మాత్రమే ముఖం కనిపించకుండా ముసుగులు ధరించేవారు.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అదే చేస్తున్నారు. ఇది సరికాదని చెబుతూ అమ్మాయిలు ఎవరూ ముఖం కనిపించకుండా కప్పుకోరాదని ఎంఈఎస్ సొసైటీ సర్క్యూలర్ జారీ చేసింది. ఎంఈఎస్ ఆదేశాలపై సంప్రదాయ ముస్లిం కుటుంబాలు మండిపడుతున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి తరగతులకు వచ్చే అమ్మాయిలు ముఖాన్ని కప్పుకోరాదని.. డ్రస్ కోడ్ ను పక్కాగా అమలు చేస్తామని ఎంఈఎస్ ఇనిస్టిట్యూషన్స్ అధ్యక్షుడు పీకే ఫజల్ గఫూర్ స్పష్టం చేశారు. అయితే వివాదాస్పద నిర్ణయంపై విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే హైకోర్టు ఆదేశాల మేరకే డ్రెస్ కోడ్ పై తాము నిర్ణయం తీసుకున్నామని ఎంఈఎస్ ఇనిస్టిట్యూషన్స్ అధ్యక్షుడు పీకే ఫజల్ గఫూర్ తెలిపారు. కేరళ సంప్రదాయంలో ముఖాన్ని కప్పుకోవడమన్నది లేదని.. ముఖం కప్పుకొని వస్తే ఎవరిని గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందుకే డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నామన్నారు. తాము ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.