Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే ప్రశ్న: రేప్ జరిగితే షూటింగుకెలా?

By:  Tupaki Desk   |   3 Aug 2017 1:34 PM IST
ఎమ్మెల్యే ప్రశ్న: రేప్ జరిగితే షూటింగుకెలా?
X
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మలయాళ నటి కిడ్నాప్- లైంగిక దాడి కేసులో కేరళకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆ నటిపై కార్లో అత్యాచారం కూడా జరిగినట్లుగా పోలీసులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఐతే అత్యాచారానికి గురైన హీరోయిన్ మరుసటి రోజే షూటింగుకి ఎలా హాజరైందంటూ కేరళకు చెందిన ఎమ్మెల్యే జార్జి ప్రశ్నించడం గమనార్హం.

ఈ కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. కావాలనే హీరో దిలీప్ ను టార్గెట్ చేసుకుని.. ఆయన్ని ఇరికించేలా కుట్ర జరిగిందని ఆరోపించిన జార్జి.. ‘‘పోలీసులు కోర్టులో చెప్పినట్లుగా ఆ నటిపై దారుణంగా అత్యాచారం జరిగి ఉంటే.. ఆమె మరుసటి రోజు ఎలా షూటింగుకి వెళ్లగలిగింది’’ అంటూ దారుణమైన రీతిలో ప్రశ్నించాడు జార్జి. దిలీప్ కుట్రకు బలయ్యాడన్నది వాస్తవమని జార్జి తేల్చి చెప్పాడు.

జార్జి వ్యాఖ్యలపై కేరళలో తీవ్ర దుమారం రేగుతోంది. ఎమ్మెల్యే అయి ఉండి జార్జి ఇంత బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు ఎలా చేస్తాడంటూ మహిళా సంఘాలు ఆయనపై మండి పడుతున్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దిలీప్ మేనేజర్ అప్పుణ్ని పోలీసుల ముందు లొంగిపోవడంతో ఈ కేసు త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. అతడి నుంచి కీలక సమాచారం రాబడుతున్నారట కేరళ పోలీసులు. ఇంకోవైపు దిలీప్ బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాడు.