Begin typing your search above and press return to search.

శబరిమల వివాదం.. ప్రభుత్వం మరో చర్య

By:  Tupaki Desk   |   24 Nov 2018 4:46 PM IST
శబరిమల వివాదం.. ప్రభుత్వం మరో చర్య
X
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వివాదం కొనసాగుతూనే ఉంది. కేరళలోని అశేష భక్తులు.. వారికి అండగా ఆర్ ఎస్ ఎస్ - బీజేపీ నేతలు పోరాడుతుంటే.. కేరళలోని సీపీఎం సర్కారు ఎలాగైనా సరే మహిళలను పోలీస్ ప్రొటెక్షన్ తో శబరిమల ఆలయంలోకి ప్రవేశింప చేయాలని కృతనిశ్చయంతో ముందుకెళ్తోంది..

తాజాగా కేవలం రెండు రోజులు ప్రత్యేకంగా మహిళా భక్తులను ఆలయంలోకి అనుమతించే ప్రతిపాదనను కేరళ సర్కారు తీసుకొచ్చింది. దీనిపై దేవస్థానం బోర్డు - అర్చకులతో సంప్రదింపులు జరుపుతామని తాజాగా హైకోర్టుకు తెలిపింది. దీంతో కేరళ సర్కారు తీరుపై హిందుత్వ వాదులు మండిపడుతున్నారు. రెండు రోజుల పాటు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తే కేరళ రణరంగంగా మారుతుందని హిందుత్వ వాదులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

అయ్యప్ప ఆలయ దర్శనంపై తాజాగా నలుగురు మహిళలు కేరళ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఈ మహిళల కోసం రెండు రోజులపాటు దర్శనం ఏర్పాట్లు చేస్తామని ప్రతిపాదన తీసుకొచ్చింది. సాధ్యాసాధ్యాలపై అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టును కోరింది. దీంతో కేసును నవంబర్ 28కి వాయిదా వేశారు. ఇలా ప్రభుత్వం మహిళలను ఎలాగైనా సరే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశింప చేయాలనే ప్రతిపాదనలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. కేరళలోని సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.