Begin typing your search above and press return to search.

కేర‌ళలో స‌గ‌టుజీవి క‌ష్టం ప‌గోడికి వ‌ద్దు!

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:25 AM GMT
కేర‌ళలో స‌గ‌టుజీవి క‌ష్టం ప‌గోడికి వ‌ద్దు!
X
రెండు వారాల్లో కేర‌ళ స్వ‌రూపం మొత్తం మారిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ పొందికైన ఇల్లు.. ఇంటి అవ‌స‌రాల‌కు స‌రిప‌డా సామాన్లు.. చేతిలో నాలుగు రూపాయిలు.. బ‌తుకు బండికి ఇబ్బంది లేని ఆదాయ‌వ‌న‌రు.. ఇలా స‌గ‌టు జీవి జీవితం సాగుతున్న కేర‌ళ‌లో పాడు వ‌ర్షం ల‌క్ష‌లాది మంది బ‌తుకుల్ని ఛిద్ర‌మ‌య్యేలా చేసింది.

మొన్న‌టివ‌ర‌కూ ఉన్న ధీమా పోయి.. ఇప్పుడు దిగులుతో కుమిలిపోయే ప‌రిస్తితి నెల‌కొంది. ప‌న్నెండు రోజులుగా విడ‌వ‌కుండా కురుస్తున్న వాన‌లు ఒక కొలిక్కి వ‌చ్చి ఇప్పుడిప్పుడు స‌హాయ పున‌రావాస కేంద్రాల్లో నుంచి.. ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న వారికి దిమ్మ తిరిగే షాకులు త‌గులుతున్నాయి. నామ‌రూపాల్లేకుండా పోయిన ర‌హ‌దారులు ఒక ఎత్తు అయితే.. మొన్న‌టివ‌ర‌కూ చ‌క్క‌టి పొద‌రిల్లులా ఉన్న ఇల్లు ఇప్పుడు గుర్తు ప‌ట్ట‌టానికి సైతం వీలు కానంత దారుణంగా మారిపోవ‌టంపై మ‌ల‌యాళీలు భోరుమంటున్నారు.

క‌ట్టుబ‌ట్ట‌లు త‌ప్పించి.. త‌మ‌కింకేమీ మిగ‌ల్లేదంటూ ప‌లువురు రోదిస్తున్నారు. వ‌ర్షం ధాటికి ఇళ్లు ప‌గుళ్లు ఇవ్వ‌టం.. లోప‌లి సామాన్లు వ‌ర‌ద నీటికి కొట్టుకుపోవ‌టం.. చేతిలో డ‌బ్బులు లేక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఇంట్లో సామాన్లు గుర్తు ప‌ట్ట‌లేన‌ట్లుగా మారిపోయి.. దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో చిక్క‌కున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రోడ్ల మీద నిలిచిన నీళ్లు.. వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకొస్తున్న జంతువుల క‌ళేబ‌రాలు చూస్తుంటే.. గుండెలు అదిరిపోతున్నాయి. మొన్న‌టివ‌ర‌కూ అంద‌మైన కాన్వాస్ చిత్రంగా ఉండే కేర‌ళ‌లో ఇప్పుడు కూలిపోయిన వృక్షాలు.. వ‌ర్షం ధాటికి ఎక్క‌డ చూసినా విధ్వంస‌మే ద‌ర్శ‌న‌మిస్తోంది.

క‌నుచూపు మేర నీళ్లు ఉన్నా.. తాగేందుకు నీళ్ల కోసం త‌పించిపోయే ప‌రిస్థితి. క‌డుపు నిండా తిండి కోసం నానా పాట్లు ప‌డాల్సి వ‌స్తోంది. వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్ట‌టంతో.. పున‌రావాస కేంద్రాల నుంచి ఇళ్ల‌కు వెళుతున్న ప్ర‌జ‌లు.. వ‌ర్షం ధాటికి దెబ్బ తిన్న త‌మ ఇళ్ల‌ను చూసి బావుర‌మంటున్నారు. సంపాదించుకున్న మొత్తం వ‌ర్షార్ప‌ణం అయ్యింద‌ని.. బ‌తుకు బండిని మ‌ళ్లీ జీరో నుంచి మొద‌లు పెట్టాల్సిందేన‌ని వాపోతున్నారు. మ‌ళ‌యాలీల క‌ష్టాలు చూసిన‌ప్పుడు.. ప‌గోడికి కూడా ఇలాంటి తిప్ప‌లు వ‌ద్దురా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.