Begin typing your search above and press return to search.

కిమ్‌ ను స‌మ‌ర్థించిన మ‌న సీఎం

By:  Tupaki Desk   |   4 Jan 2018 10:27 AM GMT
కిమ్‌ ను స‌మ‌ర్థించిన మ‌న సీఎం
X
వరుస అణు ప్రయోగాలతో అలజడి సృష్టిస్తున్న ఉత్తర కొరియా నియంత అధ్యక్షుడు - కయ్యాలమారి కిమ్ జాంగ్ ఉన్‌ కు అనూహ్య మ‌ద్ద‌తు ద‌క్కింది. ఆయ‌న‌కు మ‌న సీఎం మ‌ద్ద‌తు ప‌లికారు. కిమ్‌ కు మ‌ద్ద‌తుగా కేరళ సీఎం పినరయి విజయన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవ‌లే కేరళ రాష్ట్రంలోని ఓ ప్రదేశంలో కిమ్ జాంగ్ ఉన్న ఫొటో సీపీఎం పార్టీ బ్యానర్‌ లో కనిపించడం కలకలం రేపిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. పార్టీ సమావేశాలకు సీపీఎం కార్యకర్తలను ఆహ్వానించేందుకు ఈ పోస్టర్‌ ను రూపొందించినట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వివాదంపై స్పందించిన సీపీఎం జిల్లా కార్యదర్శి ఇలా పోస్టర్ రూపొందించడం వెనుక స్థానిక పార్టీ నేతలు పొరపాటు తప్పనిసరిగా ఉండి ఉంటుందని చెప్పారు.

అయితే అలా చోటా నేత‌లు చేసిన చ‌ర్యే వివాదం కాగా...తాజాగా ఏకంగా ముఖ్య‌మంత్రి కిమ్‌ కు మ‌ద్ద‌తిస్తూ మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. కోజికోడ్‌ లో జరిగిన ఓ సమావేశంలో కేర‌ళ సీఎం మాట్లాడుతూ... నార్త్ కొరియాపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా ధీటుగా పోరాడుతోందని అన్నారు. అగ్ర రాజ్యం అమెరికా విధించిన ఒత్తిళ్లను నార్త్ కొరియా సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆయన అన్నారు. నార్త్ కొరియా అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం విజయన్ మెచ్చుకున్నారు. చైనాపై పోరాటం చేయడం కన్నా.. సామ్రాజ్యవాద శక్తులతో నార్త్ కొరియా చేస్తున్న పోరాటం మేలైందన్నారు. సామ్రాజ్యవాద శక్తుల పట్ల చైనా సరైన పోరాటం చేయడం లేదన్నారు. సోషలిస్టు భావజాలంతో నార్త్ కొరియా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నదని, కానీ అమెరికా దాన్ని ధ్వంసం చేసేందుకు చూస్తున్నదని మరో నేత ఆరోపించారు.

కాగా, కిమ్ పోస్ట‌ర్ వెలుగులోకి వ‌చ్చిన‌ప్పుడే...బీజేపీ విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ట్విట్టర్‌ లో స్పందిస్తూ.. కేరళలో ప్రత్యర్థులను హతమార్చేందుకు రాష్ట్రాన్ని హత్యాకాండగా మార్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. భారత్ లోని బీజేపీ - ఆరెస్సెస్ కార్యాలయాలపై కిమ్ జాంగ్ తరహాలో సీపీఎం అణు క్షిపణులను వేయదని ఆశిస్తున్నట్టు ట్విట్టర్లో ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.