Begin typing your search above and press return to search.

ఆటో డ్రైవర్ అడిగాడు.. ఆ సీఎం వాళ్లింటికి వెళ్లి భోజనం చేశారు

By:  Tupaki Desk   |   23 Nov 2021 1:30 PM GMT
ఆటో డ్రైవర్ అడిగాడు.. ఆ సీఎం వాళ్లింటికి వెళ్లి భోజనం చేశారు
X
అందరు ముఖ్యమంత్రులు ఒకేలా ఉండరు. ముఖ్యమంత్రిగా రెండో టర్మ్ విజయవంతంగా పని చేస్తూ.. ఏ రోజు సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపిస్తారు. ఆయన్ను కలవాలంటే మంత్రులకు సైతం సాధ్యం కాదు.

ఇక సామాన్యుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కేసీఆర్ ఎప్పుడైనా..ఎవరి విషయంలో అయినా అనుకోవాలే కానీ.. ఎక్కడో ఊళ్లో ఉండే రైతులు ఆయనుండే ఫార్మర్ హౌస్ కు వెళ్లి మరీ కలిసి వస్తారు. కంప్లైంట్లు ఇవ్వగలుగుతారు. ఆ వెంటనే అధికారులు వాయువేగంతో పని చేసి రిపోర్టులు ఇచ్చేస్తుంటారు. ఇదంతా ఎవరి విషయంలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

తెలుగు రాష్ట్రానికి సంబంధించి మరో ముఖ్యమంత్రివైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన అధికార నివాసం వద్ద తెల్లారిందిమొదలు మహా సందడిగా ఉండేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారందరిని అప్యాయంగా పలుకరిస్తూ.. వారిచ్చే వినతుల్ని తీసుకొని పరిష్కరించేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తెలుగు నేల మీద లేదు. అయితే.. దేశంలో ఉన్న సీఎంలు అందరూ ఒకేలా ఉండరన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మిగిలిన ముఖ్యమంత్రుల సంగతి ఎలా ఉన్నా.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీరు కాస్త భిన్నమన్న సంగతి తెలిసిందే. సగటు మధ్యతరగతి వ్యక్తిలా ఉండే ఆయన.. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. త్వరలో జరగునున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలని తపిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పంజాబ్ లో తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. పంజాబ్ లోని పర్యటించారు కేజ్రీవాల్. లూధియానాలో ఆటోడ్రైవర్లతో సమావేశయ్యారు. వారి కష్టనష్టాల్ని తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా దిలీప్ తివారీ అనే ఆటో డ్రైవర్ మైక్ తీసుకొని.. ముఖ్యమంత్రిగారు.. మీరంటే చాలా ఇష్టం.. మీరు చాలామంది ఆటో డ్రైవర్లకు సాయం చేశారు.ఈ పేద ఆటోవాలా ఇంటికి భోజనానికి రాగలరా? మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానిస్తున్నా?’ అని పేర్కొన్నారు.

ఇదే ప్రశ్న వేరే వారిని అడిగితే ఏమయ్యేదో కానీ.. సీఎం కేజ్రీవాల్ మాత్రం వెంటనే స్పందిస్తూ.. తప్పకుండా..ఈ రాత్రికి ఓకేనా? అని ప్రశ్నించారు. దీంతో మహా ఆనందపడిపోయాడు దిలీప్. తన మాటలకు కొనసాగింపుగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తనతో పాటు భగవంత్ మన్.. హర్పాల్ సింగ్ ను కూడా తీసుకురావచ్చా? అని అడిగారు. దీంతో దిలీప్ సంతోషంగా ఓకే చెప్పటం.. సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది.

ఇచ్చిన మాటకు తగ్గట్లే.. దిలీప్ ఆటోలోనే అతడి ఇంటికి వెళ్లారు. అతని కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడపటమేకాదు.. నేల మీద కూర్చొని భోజనం చేశారు. ఆ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలకు ముగ్దుడ్ని అయ్యానని.. భోజనం చాలా బాగుందని చెప్పారు.

ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసిన కేజ్రీవాల్ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సదరుఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఢిల్లీలోని తన ఇంటికి రావాలని ఆహ్వానించినట్లుగా తెలిపారు. దీనిపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.