Begin typing your search above and press return to search.

ట్విస్టుతో ఉక్కిరిబిక్కిరి..ఏసీబీకి షాకిచ్చిన నాగరాజు సతీమణి

By:  Tupaki Desk   |   21 Aug 2020 6:30 PM IST
ట్విస్టుతో ఉక్కిరిబిక్కిరి..ఏసీబీకి షాకిచ్చిన నాగరాజు సతీమణి
X
లంచం తీసుకునే అవినీతి పాముల ఉదంతాలు కొత్తేం కాదు. కానీ.. అప్పుడప్పుడు దొరికే అనకొండల సంచలనం అంతా ఇంతా కాదు. ఒక భూమి వివాదానికి సంబంధించి సెట్ చేసేందుకు రూ.2కోట్లకు పైనే లంచం మాట్లాడేసుకొని.. తొలి విడతగా రూ.1.10 కోట్ల మొత్తాన్ని తీసుకునే వేళ ఏసీబీకి దొరికిపోయిన మేడ్చల్ ఎమ్మార్వో నాగరాజు ఉదంతం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ ఉదంతంలో.. ఒకేసారి ఇంత భారీ మొత్తం దొరకటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏసీబీ.. మరింత లోతుల్లోకి వెళ్లి కేసును విచారిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నాగరాజు సతీమణి ఇచ్చిన ట్విస్టుతో ఏసీబీ అధికారులకు దిమ్మతిరిగి పోయే షాక్ తగిలిందని చెబుతున్నారు. బ్యాంకు లాకర్ గురించి వివరాల్ని తెలుసుకునేందుకు నాగరాజు సతీమణి స్వప్నను అధికారులు ప్రశ్నించగా.. ఆమె తెలివిగా తప్పుదారి పట్టించిన విషయం బయటకు వచ్చింది. బ్యాంకు లాకర్ అల్వాల్ బ్రాంచిదని చెప్పిన ఆమె మాటల్ని నమ్మి వెళ్లిన అధికారులకు.. అదంతా అబద్ధమని తేలింది.

ఆ వెంటనే ఆమెను కాంటాక్టు చేసే ప్రయత్నం చేయగా.. ఆమె అందుబాటులోకి రాని పరిస్థితి. ఆమె ఫోన్ ను ఇప్పటికే అధికారులు సీజ్ చేయటంతో.. ఆమెను ఏ రీతిలో కాంటాక్టు చేయాలన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. నమ్మకంగా వివరాలు చెప్పినట్లే చెప్పి.. చల్లగా జారుకున్న స్వప్న ఉదంతం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.