Begin typing your search above and press return to search.

విచారణలో నోరు విప్పితే ఒట్టు.. చుక్కలు చూపిస్తున్న నాగరాజు

By:  Tupaki Desk   |   26 Aug 2020 10:15 AM IST
విచారణలో నోరు విప్పితే ఒట్టు.. చుక్కలు చూపిస్తున్న నాగరాజు
X
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కీసర తహసీల్దార్ నాగరాజు వ్యవహారం ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. ఒక ల్యాండ్ ఇష్యూను సెటిల్ చేసేందుకు రూ.2కోట్లకు పైగా లంచంతో పని పూర్తి చేసేలా కమిట్ మెంట్ తీసుకొని.. ఒప్పందంలో భాగంగా తొలివిడతగా రూ.1.1కోట్ల మొత్తాన్ని తీసుకుంటున్న వేళ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం తెలిసిందే. సాధారణంగా అవినీతి భాగోతాల్లో బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు ఆపరేషన్ నిర్వహిస్తారు. నాగరాజు ఎపిసోడ్ కాస్త భిన్నం.

ఇతగాడి లీలల గురించి కంప్లైంట్ అందుకున్న ఏసీబీ అధికారులు.. రహస్య విచారణ జరిపి.. రెక్కీ నిర్వహించి మరీ పట్టుకున్నట్లుగా చెబుతారు. అవినీతి అనకొండగా చెప్పే నాగరాజు.. ఆయన బంధువులు.. స్నేహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆధారాల్ని.. అవినీతి సొమ్మును గుర్తించినట్లుగా చెబుతున్నారు.

ఇతగాడి అవినీతి భాగోతంపై విచారణ జరుపుతున్న అధికారులు.. ఆయన్నుజైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. అధికారుల విచారణను ఎదుర్కొంటున్న నాగరాజు.. ఊహించని రీతిలో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ప్రశ్న ఏదైనా సరే.. మౌనమే సమాధానమని.. ఏం అడిగినా.. ఏమీ చెప్పటం లేదంటున్నారు. గుచ్చి.. గుచ్చి అడిగితే కూడా నోరు విప్పటం లేదంటున్నారు. అధికారుల సహనానికి పరీక్షగా మారిందని చెబుతున్నారు. ప్రశ్న ఏదైనా.. రెడీమెడీ సమాధానాలు సిద్దంగా ఉంటాయని తెలుస్తోంది.

చాలా సందర్బాల్లో నోరే విప్పరని.. ఒకవేళ విప్పినా.. పొడిపొడి సమాధానాల్ని చెప్పేసి ఊరుకుంటారని చెబుతున్నారు. ఈ తీరులో విచారణ సాగితే.. ఎన్నిరోజులు విచారించిన పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. దీంతో.. ఆయన్ను ఎలా డీల్ చేయాలో ఒక పట్టాన అర్థం కావటం లేదంటూ తల పట్టుకుంటున్నారు. విచారణలో నాగరాజు తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.