Begin typing your search above and press return to search.

కేఈ కృష్ణ‌మూర్తి నెక్స్ట్ స్టెప్ ఎటు..!

By:  Tupaki Desk   |   19 Sep 2015 8:42 AM GMT
కేఈ కృష్ణ‌మూర్తి నెక్స్ట్ స్టెప్ ఎటు..!
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు - డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి మ‌ధ్య నెల‌కొన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఇప్పుడు టీడీపీలోనే పెద్ద హాట్ టాపిక్‌ గా మారింది. తాజాగా చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన స‌మావేశంలో రెవెన్యూ శాఖ‌లో అవినీతి పెరిగిపోయింద‌ని..అవినీతిలో రెవెన్యూ శాఖ డ‌బుల్ డిజిట్ గ్రోత్ సాధించింద‌ని విమ‌ర్శించారు. ఈ వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా కేఈ కృష్ణమూర్తి ప‌నితీరును ఉద్దేశించే చంద్ర‌బాబు చేశార‌ని కూడా వార్తలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై స్పందించిన కేఈ రెవెన్యూ శాఖ బాగా పనిచేస్తోందని చెప్పారు. రెవెన్యూ శాఖ‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టామ‌ని...ప్ర‌జ‌ల‌కు వెసులుబాటు క‌ల్పించేలా అనేక నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని.... వెబ్‌ లో భూముల వివ‌రాల న‌మోదులో త‌ప్పులు వ‌స్తే వాటిని స‌రిచేయ‌డానికి ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశామ‌ని చెప్పుకొచ్చారు. త‌క్కువ టైంలోనే ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు జారీ చేస్తున్నామ‌ని రెవెన్యూ శాఖ‌లో తీసుకొచ్చిన ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌ను ఏక‌రువు పెట్టారు. చంద్ర‌బాబును ప్ర‌శంసిస్తూనే ఆయ‌న త‌న శాఖ గురించి కూడా గొప్ప‌గా చెప్పుకున్నారు.

ఇదిలా ఉంటే చంద్ర‌బాబు ప‌దే ప‌దే కేఈని టార్గెట్ చేసుకుని విసుర్లు విసురుతుండ‌డంతో కేఈ కూడా చంద్ర‌బాబు ధోర‌ణితో విసిగిపోయి ఉన్నార‌ని టాక్‌. ఆయ‌న నోరు తెరిచి ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న గూడుపుఠాణి వ్య‌వ‌హారాల గురించి మాట్లాడితే చంద్ర‌బాబుతో పాటు ప్ర‌భుత్వం ఇబ్బందుల్లో ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కేఈ ప‌లుసార్లు ప‌రోక్షంగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు కేఈకు ప్ర‌యారిటీ లేని శాఖ‌ను ఇచ్చి, ప్ర‌భుత్వంలో ఆయ‌న ప్రాధాన్య‌త‌ను మ‌రింత త‌గ్గించేలా చేయాల‌న్నా కుదిరేలా క‌నిపించ‌డం లేదు. పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న సీనియ‌ర్ నేత‌, బ‌ల‌మైన బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.

చంద్ర‌బాబు-కేఈ మ‌ధ్య పోరు చూస్తుంటే ఈ వివాదం మరింత ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి. చాలా మంది మంత్రుల‌తో పోలిస్తే కేఈ బెట‌రే అన్న అభిప్రాయం ఉంది. అయితే వాళ్ల‌ను వ‌దిలేసి కలెక్టర్ ల సమావేశంలో నేరుగా కేఈని టార్గెట్ చేసుకుని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటు చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై కేఈ శిబిరం కూడా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. కావాల‌నే కేఈ ప‌ట్ల ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్లేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారా అని కూడా వారు ఈ వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చిస్తున్నార‌ట‌. డిప్యూటీ క‌లెక్ట‌ర్ల బ‌దిలీల‌ను ప్ర‌భుత్వం ఏకంగా మూడుసార్లు ఆపేయ‌డంపై కూడా కేఈ చాలా సీరియ‌స్‌ గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ విష‌యంలో కేఈ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో...ఎలా స్పందిస్తారో అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా ఉంది.