Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక హోదా: టైం డిసైడ్ చేసిన కేఈ

By:  Tupaki Desk   |   6 Aug 2015 12:00 PM GMT
ప్ర‌త్యేక హోదా:  టైం డిసైడ్ చేసిన కేఈ
X
ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మంత్రి ఇంద్ర‌జీత్ సింగ్ లోక్‌ స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న ర‌చ్చ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఏ రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారుకు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ స్పెష‌ల్ స్టేటస్‌ పై గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్ట‌లేక‌పోతోంది. మ‌రోవైపు పొత్తు ఉన్నా...ఇచ్చిన హామీని కూడా సాధించ‌లేక‌పోవ‌డం ఏంట‌ని ప్రతిపక్షాలు ఏపీ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఏపీ మంత్రులు స‌హా టీడీపీ నేత‌లు సంద‌ర్భానుసారం లౌక్యంగా త‌మ వాద‌న వినిపిస్తున్నారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినందున ఇతర రాష్ట్రాలతో ఏపీని ముడి పెట్టడం సరికాదని అన్నారు. ఈ నెల 22లోగా ప్ర‌త్యేక‌ హోదా వస్తుందని భావిస్తున్నానని కేఈ తెలిపారు. హోదాపై బీజేపీ పిల్లి మొగ్గలు వేయడం సరికాదని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అసలు విభజన బిల్లులోనే ప్రత్యేక హోదా అంశాన్ని చేరిస్తే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని కేఈ అభిప్రాయపడ్డారు.

మొత్తంగా విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన కాంగ్రెస్‌ ను గ‌ట్టిగా విమ‌ర్శించిన కేఈ అంతే స్థాయిలో బీజేపీకి చుర‌క‌లు వేశారు. కాక‌పోతే డెడ్‌ లైన్ పెట్టి టీడీపీ ని ఇరుకున పెట్టాడేమో అని తెలుగుత‌మ్ముళ్లు స‌ణుక్కుంటున్నారు.