Begin typing your search above and press return to search.

తెల్ల జెండా ఎత్తేసిన‌ట్లేనా కేఈ!

By:  Tupaki Desk   |   9 Sep 2016 7:46 AM GMT
తెల్ల జెండా ఎత్తేసిన‌ట్లేనా కేఈ!
X
ఫ‌లితం గురించి ముందే ఒక అభిప్రాయానికి వ‌చ్చేసి పోరాడితే ఎలా ఉంటుందో ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల మాట‌లు కూడా అలానే ఉన్నాయి. సున్నిత‌మైన అంశాల ప‌ట్ల తొంద‌ర‌ప‌డి మాట్లాడితే క‌లిగే న‌ష్టం అంతాఇంతా కాదు. ఆ విష‌యం తెలిసి కూడా సీమాంధ్రుల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి వ్యాఖ్య‌లు ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చే అవ‌కాశం లేదంటూ కుండ‌బ‌ద్ధ‌లుకొట్టేసిన కేఈ మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

రాష్ట్ర అభివృద్ధికి మూడేళ్ల కీల‌క స‌మ‌యం ఉన్న వేళ‌.. కేంద్రంతో ఘ‌ర్ష‌ణ వైఖ‌రి ఉండ‌కుండా నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవాల‌న్న‌ట్లుగా మాట్లాడిన వ్యాఖ్య‌లు ప‌లువురికి విస్మ‌యాన్ని రేకెత్తిస్తున్నాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్ని తీసుకుంటూనే.. హోదా మీద రాజీలేని పోరాటం చేస్తామ‌న్న చంద్ర‌బాబు మాట‌కు భిన్నంగా కేఈ వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. అసెంబ్లీ స‌మావేశాల రెండో రోజున స‌భ వాయిదా ప‌డిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన కేఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

హోదా రాద‌ని తెలిసినా జ‌గ‌న్ అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌తి అంశాన్ని సునిశితంగా ప‌రిశీలించిన త‌ర్వాతే ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న కేఈ.. చంద్ర‌బాబుకు ఏపీ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిల‌వాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే స‌మ‌యంలో ప్ర‌తిఒక్క‌రూ కేసీఆర్‌ ను నిరుత్సాహ‌ప‌రిచారు. కొంద‌రైతే జోకులు వేసినోళ్లు ఉన్నారు.అయినా కేసీఆర్ వాటిని ప‌ట్టించుకునే వారు కాదు. త‌న వెంట ఉన్న‌శ్రేణుల్లో నిరుత్సాహాన్ని ద‌రి చేర‌నిచ్చే వారుకాదు. తెలంగాణ రాష్ట్ర‌సాధ‌న‌లో కేసీఆర్‌కు త‌గిలిన ఎదురుదెబ్బ‌లు ఎన్ని అన్న‌వి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అయినా.. వెనక్కి త‌గ్గ‌క ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న తీరుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న అంతిమంగా తాను అనుకున్న‌ది సాధించారు.

కానీ.. ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల తీరు అలా లేదు. కేంద్రంతో ఘ‌ర్ష‌ణ ఎందుక‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే త‌ప్పించి.. న్యాయం కోసం.. ధ‌ర్మం కోసం పోరాటం చేయ‌టంలో త‌ప్పేముంది? అన్న ప్ర‌శ్న‌ను వేసుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఓప‌క్క ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హోదా కోసం పోరాటం చేస్తాన‌ని చెబుతున్న వేళ‌.. ఆయ‌న క్యాబినెట్ కు చెందిన మ‌రొక‌రు హోదా రాద‌ని తెలిసీ విప‌క్షం రార్దాంతం చేస్తుంద‌ని వ్యాఖ్యానించ‌టంలో అర్థం ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌.

హోదా రాద‌న్న‌ది తేల్చేసిన కేఈ జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పైనా ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. ఏడాదికి ఒక్క‌సారి వేదిక‌లెక్కి మీటింగ్ లు పెట్టే ర‌కం తాము కాదంటూ వ్యాఖ్యానించారు. మిత్ర‌ప‌క్షంగా ఉన్న ప‌వ‌న్ మీద ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కెలికటం ఏ మాత్రం మంచిది కాదు. ఓప‌క్క ప్యాకేజీ విష‌యంలో పీక‌ల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీ స‌ర్కారుకు న‌ష్టం క‌ల‌గ‌కుండా చూడాల్సిన కేఈ లాంటోళ్లు ప‌వ‌న్ మీద ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేస్తూ.. ఆయ‌న చేత ఏపీ స‌ర్కారును నాలుగు మాట‌లు అనేలా చేస్తున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏది ఏమైనా హోదా విష‌యంలో కేఈ వ్యాఖ్య‌లు ఏమాత్రం స‌మంజ‌సంగా లేవ‌ని.. యుద్ధానికి ముందే తెల్ల‌జెండా ఎత్తేసిన‌ట్లుగా.. ఏపీ ప్ర‌జ‌ల భ‌విత‌ను మార్చే హోదా విష‌యంలో వెన‌క‌డుగు వేయ‌టం స‌రైన‌దేనా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న కేఈ లాంటోళ్లు త‌మ‌కు తాము వేసుకుంటే బాగుంటుందేమో..?