Begin typing your search above and press return to search.

ఈ మాటలు బాబుకే నేరుగా చెప్పొచ్చుగా కేఈ

By:  Tupaki Desk   |   29 July 2016 9:33 AM GMT
ఈ మాటలు బాబుకే నేరుగా చెప్పొచ్చుగా కేఈ
X
వినేవాడు ఉంటే చెప్పేటోళ్లు చెలరేగిపోతారని ఊరికే అనరు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీరు చూస్తే ఇది నిజమనించక మానదు. ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి భారీ సర్వే ఒకటి చేయించిన సంగతి తెలిసిందే ఈ సర్వేలో మంత్రులు.. ఎమ్మెల్యేల పనితీరుతోపాటు వివిధ శాఖల పనితీరు ఎలా ఉందన్న విషయం మీద ఫోకస్ చేశారు. ఈ వివరాల్ని ఈ మధ్యకాలంలో తరచూ ప్రస్తావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాను చూస్తున్న రెవెన్యూ శాఖలో 42 శాతం అవినీతి తేలిన విషయాన్ని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ఎలా చూడాలన్నది కేఈ కృష్ణమూర్తి ఒక చిత్రమైన వాదనతో చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి లెక్క ప్రకారం రెవెన్యూ శాఖలో 42 శాతం అవినీతి ఉన్నట్లు తెలిందని.. కానీ ఈ విషయాన్ని 58 శాతం నిజాయితీపరులు పని చేస్తున్న కోణంలో చూడాలన్నారు.

రెవెన్యూ శాఖలాంటి పెద్ద వ్యవస్థలో అందరూ మహాత్మాగాంధీలే ఉండరని..చిన్న చిన్న లోపాలు ఉంటాయన్నారు. రెవెన్యూ శాఖ మొత్తం అవినీతిమయం అన్నట్లుగా చెప్పకూడదని.. ఆ కోణంలో చూడకూడని చెబుతున్న మాటలు చూస్తే.. కేఈ తాను చెప్పే మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నది ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

నలుగురికి తెలిసేలా కొత్త కొత్త యాంగిల్స్ (అదేనండి కొత్త కొత్త కోణాలు) గురించి చెప్పి రచ్చ చేసుకునే బదులు.. రెవెన్యూ శాఖ అవినీతిమయంగా ఉందన్న మాట తనను హర్ట్ చేస్తుందని.. అలాంటి వ్యాఖ్యలు చేసి తనను నొప్పించొద్దంటూ బాబుకే నేరుగా చెబితే సరిపోతుంది కదా? ఏమైనా అధినేతను గిల్లేలా మాట్లాడటం కేఈకి తెలిసినంతగా బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి.