Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిర్ణ‌యం ఏపీ ఫాలో కాదంట‌

By:  Tupaki Desk   |   5 May 2017 4:51 PM GMT
కేసీఆర్ నిర్ణ‌యం ఏపీ ఫాలో కాదంట‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ఒకింత త‌క్కువ‌ క‌స‌ర‌త్తుతో, స్వ‌ల్ప‌ కాలంలో విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ప్ర‌క్రియ ఏదైనా ఉందా అంటే.... అది కొత్త జిల్లాల ఏర్పాటు! 10 జిల్లాల తెలంగాణ‌ను 31 జిల్లాలుగా విజ‌యవంతంగా పూర్తిచేశారు. మిగ‌తా అంశాల వ‌లే ఈ విష‌యంలో పెద్ద‌గా కోర్టు కేసులు, ప్ర‌తిఘ‌ట‌న‌లు ఎదురుకాలేదు. కొన్నిచోట్ల నిర‌స‌న‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని గౌర‌వించిన కేసీఆర్‌... స‌మ‌స్య‌కు చెక్ పెట్టారు. ఈ ప్ర‌క్రియ తెలంగాణ‌లో పూర్త‌యిన త‌ర్వాత అందరి చూపు పొరుగు రాష్ట్రమైన ఏపీపై ప‌డింది. తెలంగాణ‌తో పోలిస్తే విశాల‌మైన‌ ఏపీలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందా అని చ‌ర్చోప‌చర్చ‌లు సాగాయి. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెట్టారు.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉప‌ముఖ్య‌మంత్రి, రెవెన్యూ శాఖ మంత్ర అయిన కేఈ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన లేదని తేల్చిచెప్పారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప‌రిపాల‌న‌ను మ‌రింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్న‌ట్లు వివ‌రించారు. ఆఫీసుల్లో సిసి కెమేరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉప‌ముఖ్య‌మంత్రి కేఈ తెలిపారు. దీంతో పాటుగా ఈ ఆఫీస్ విధానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

క్షేత్ర‌స్థాయిలో ప‌రిపాల‌న‌ను మ‌రింత మెరుగ్గా అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాల‌ని ఉప‌ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కోరారు. అధికారులు అవినీతికి దూరంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌ని సూచించారు. కాగా, గ్రామ కంఠాల క్రమబద్ధీకరణకు జీఓ విడుదలైనట్లు కేఈ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/