Begin typing your search above and press return to search.

బాబు ఆఫర్‌ తో కేఈ బ్ర‌ద‌ర్స్ చ‌ల్ల‌బ‌డ్డారా?

By:  Tupaki Desk   |   9 March 2017 4:05 AM GMT
బాబు ఆఫర్‌ తో కేఈ బ్ర‌ద‌ర్స్ చ‌ల్ల‌బ‌డ్డారా?
X
టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి త‌మ్ముడు - మాజీ మంత్రి కేఈ ప్ర‌భాకర్‌కు ఓ చిన్న ప‌ద‌విని ఇచ్చేసిన ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... కేఈ ఫ్యామిలీలోని అసంతృప్తికి చెక్ పెట్టారా? అంటే.. ఆ విష‌యం కేఈ ఫ్యామిలీకే తెలియాలి అని అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ఎందుకంటే... క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి ఆది నుంచి వెన్నుద‌న్నుగా నిల‌బ‌డ్డ కేఈ ఫ్యామిలీకి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వ‌మే జ‌రిగింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్ర‌బాబు కేబినెట్‌ లో కేఈ సోద‌రులిద్ద‌రూ మంత్రులుగా ప‌నిచేశారు. కేఈ ప్ర‌భాక‌ర్ చిన్న నీటి పారుద‌ల శాఖ మంత్రిగా ప‌నిచేశారు. నాడు త‌న ప‌నితీరుతో జూనియ‌ర్ కేఈ మంచి మార్కులే వేయించుకున్నార‌ట‌. అయితే ఏవో కొన్ని అనివార్య కారణాల వ‌ల్ల ప్ర‌భాకర్ కొంత‌కాలం పాటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే 2014 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న తిరిగి యాక్టివేట్ అయినా... ఆయ‌న‌కు సీటిచ్చేందుకు మాత్రం చంద్ర‌బాబు స‌సేమిరా అన్నారు.

పార్టీలో చంద్ర‌బాబు కంటే సీనియ‌ర్ అయిన కేసీ కృష్ణ‌మూర్తి అభ్య‌ర్థించినా కూడా చంద్ర‌బాబు త‌న‌కేమీ విన‌బ‌డ‌న‌ట్టే ఉండిపోయారు. అయితే త‌ర్వాత ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తానులే అంటూ నాడు చంద్ర‌బాబు చెప్ప‌డంతో కేఈ ఫ్యామిలీ కూడా చాలా ఓపిగ్గానే ఉండిపోయింది. ఈ ద‌ఫా ఎమ్మెల్సీ టికెట్ల‌లోనూ వారికి చంద్ర‌బాబు మొండిచెయ్యే చూపారు. దీంతో ఇక ఊరికే ఉంటే ప‌ని కాద‌నుకున్న సీనియ‌ర్ కేఈ... నిన్న చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కారు. పార్టీని న‌మ్ముకుని పనిచేస్తుంటే.. చంద్ర‌బాబు మాకిచ్చిన గౌర‌వ‌మిదేనంటూ త‌న తమ్ముడికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డాన్ని చూపి కాస్తంత వెట‌కార‌మాడారు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు కార్య‌రంగం సిద్ధం చేసిన చంద్ర‌బాబు అప్ప‌టిక‌ప్పుడు ఓ ప‌క్కా ప్ర‌ణాళిక‌ను ర‌చించారు.

జూనియ‌ర్ కేఈని విజ‌య‌వాడ‌కు పిలిపించి మ‌రీ... గ‌తంలో ప్ర‌భాక‌ర్ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన శాఖ‌లో ఓ చిన్న‌ విభాగంగా ఉన్న ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్(ఐడీసీ) చైర్మ‌న్ ప‌దవి ఇస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే తాను మంత్రిగా ప‌నిచేసిన శాఖ‌కు చెందిన ఓ చిన్న విభాగానికి చైర్మ‌న్‌గా అంటే త‌న హోదాను త‌గ్గించిన‌ట్లే అవుతుంద‌ని ప్ర‌భాక‌ర్... చంద్ర‌బాబు ముఖం మీదే చెప్పేశారు. ఇలాగైతే ప‌ని కాద‌నుకున్న చంద్ర‌బాబు... కేఈ జిల్లాకు చెందిన కొంద‌రు టీడీపీ నేత‌ల‌ను రంగంలోకి దించార‌ట‌. ఐడీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇరిగేష‌న్ శాఖ‌లో చిన్న ప‌ద‌వే అయిన‌ప్ప‌టికీ... క‌ర్నూలు లాంటి జిల్లాల్లో ఐడీసీకి మంచి ప్రాధాన్య‌మే ఉంటుంద‌ని స‌ద‌రు నేత‌ల ద్వారా కేఈ వ‌ర్గానికి చంద్ర‌బాబు న‌చ్చ‌జెప్పే య‌త్నం చేశారు.

ఏ ప‌ద‌వి లేకుండా ఉండే కంటే... ఏదో ఒక ప‌ద‌విలో ఉంటే 2019 ఎన్నిక‌ల నాటికైనా కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌క‌పోతాయా? అని కూడా వారు కేఈకి చెప్పార‌ట‌. ఎలాగోలా ఈ రాయ‌బారమైతే ఫ‌లించింది. ఈ మంత్రాంగం ఫ‌లించ‌డానికి రెండు రోజులు ప‌ట్టినా... కేఈ వ‌ర్గం చివ‌ర‌కు నిన్న రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత స‌ద‌రు ప‌ద‌విని తీసుకునేందుకు ఒప్పేసుకుంది. ఇక అంతే... ఏమాత్రం ఆల‌స్యం చేసినా... జూనియ‌ర్ కేఈ ఎక్క‌డ మ‌న‌సు మార్చుకుంటారోన‌న్న భ‌యంతో చంద్ర‌బాబు రాత్రికి రాత్రే స‌ద‌రు ప‌ద‌వికి సంబంధించిన ఉత్త‌ర్వులను జారీ చేయించారు. మ‌రి ఈ ప‌ద‌వితో కేఈ సోద‌రులు చ‌ల్ల‌బ‌డ్డారా? లేదా? అని చెప్ప‌డానికి కాస్తంత స‌మ‌యం అయితే వేచి చూడాల్సిందేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/