Begin typing your search above and press return to search.

హరీశ్ నోటి నుంచి మానుకోట మాటలా అంటున్న కేఈ

By:  Tupaki Desk   |   17 May 2016 12:46 PM IST
హరీశ్ నోటి నుంచి మానుకోట మాటలా అంటున్న కేఈ
X
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన జలదీక్ష నేపథ్యంలో.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరిపై జగన్ ఫైర్ కావటం తెలిసిందే. జగన్ చేసిన వ్యాఖ్యలపై అంతే తీవ్రంగా రియాక్ట్ అయిన తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడితే.. మానుకోట సీన్ పునరావృతం అవుతుందని హెచ్చరించటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి.. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి స్పందించారు.

మంత్రి హోదాలో ఉన్న హరీశ్.. తరిమికొడతామంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని.. బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఎక్కడ ఉన్నాయో? వాటికి అనుమతులు ఎప్పుడు వచ్చాయో? చూపించాలని కేఈ ప్రశ్నించారు.

ఓపక్క హరీశ్ పై విమర్శలు చేసిన కేఈ.. మరోవైపు జల జగడాలకు ఆద్యుడిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. జలవివాదాలకు వైఎస్ కారణమన్న కేఈ.. రాయలసీమ ఏడారిలా మారుతుందన్న మాటను తరచూ చెప్పటం సరికాదంటూ కేఈ వ్యాఖ్యలు వింటుంటే.. జగన్ జలదీక్ష తాలూకు సెగ తెలుగు తమ్ముళ్లకు బాగానే తాకుతుందన్న విషయం అర్థంకాక మానదు.