Begin typing your search above and press return to search.

కేఈ ఉప ముఖ్యమంత్రి పదవి ఊడుతుందా...?

By:  Tupaki Desk   |   24 May 2015 10:15 AM GMT
కేఈ ఉప ముఖ్యమంత్రి పదవి ఊడుతుందా...?
X
పిలిచి పీటేస్తే దాంతోనే కొట్టాడట ఒకడు... అలా ఉంది ఏపీలో కొందరు మంత్రుల పద్ధతి. కొత్త రాష్ట్రంలో ఉత్సాహంగా పనిచేసి టీడీపీకి, రాష్ట్రానికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతో కొందరికి చంద్రబాబు తన ప్రభుత్వంలో పెద్ద పదవులు ఇచ్చారు. టీడీపీలో కీలక నేతలకు కూడా కొందరికి పదవులు రాని పరిస్థితిలో ఏకంగా రెండు ఉపముఖ్యమంత్రి పదవులు కూడా ఇచ్చారు చంద్రబాబు. అయితే వారిలో ఒక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాత్రం చంద్రబాబు తనకు ఇచ్చిన ఈ గౌరవాన్ని మరిచి ఆదినుంచి ఆయనపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. దీంతో ఆయనకు ఆ స్థాయి పదవి ఇచ్చి తప్పు చేశారంటూ పలువురు టీడీపీ సీనియర్లు చంద్రబాబు వద్దే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. కేఈ సీనియరే కావొచ్చు కానీ రాష్ట్ర స్థాయి నేత కాదన్నది వారి అభిప్రాయం. కనీసం రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ కూడా ఆయన ప్రభావం చూపలేరని.. కర్నూలు జిల్లాకు మాత్రంమే ఆయన పరిమితమని అంటున్నారు. అలాంటి కేఈకి ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా నిత్యం చంద్రబాబునే విమర్శిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత కేఈ మంత్రిగానే ఉంటారు కానీ ఉప ముఖ్యమంత్రి హోదా పోవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

కేఈ గతంలో రాజధాని వ్యవహారాలపై చంద్రబాబుపై పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. అయితే, రాష్ట్రాభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్న చంద్రబాబు ఇలాంటివి పట్టించుకోలేదు. ఒకరకంగా చెప్పాలంటే లైట్‌ గా తీసుకున్నారు. కానీ, కేఈ తాజాగా మళ్లీ చంద్రబాబుపై విమర్శలకు దిగారు. పశ్చిమగోదావరి జిల్లాను మాత్రమే పట్టించుకుంటున్నారని కర్నూలును పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. దీంతో ఈసారి మాత్రం చంద్రబాబు గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. ఇలా చూసీచూడనట్లు వదిలేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన గుర్తించి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. కెఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కర్నూలు జిల్లా అభివృద్ధి విషయంలో తాను సవాల్‌ చేస్తున్నానని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాకు తాను అభివృద్ధి పనులు చేస్తున్నానని ఆయన చెప్పారు.. కర్నూలు జిల్లాకు పరిశ్రమలు, విద్యాసంస్థలు, టౌన్‌షిప్‌ తెస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. కెఈ వ్యాఖ్యల వల్ల నష్టం లేదని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు సలహాలు ఉంటే ఇవ్వాలి గానీ ప్రజలను రెచ్చగొట్ట కూడదని ఆయన అన్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో కేఈపై చంద్రబాబు యాక్షన్‌ తీసుకుంటారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కొద్ది వారాల్లో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో కేఈ పదవికి ఎసరుకు రాకపోయినా ఆయనవద్ద ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం పోవచ్చన్న వాదన వినిపిస్తుంది. గట్టిగా వ్యవహరించకపోతే కేఈ వంటివారు మరింత మంది తయారవుతారని.... రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో బిజీగా ఉంటూ పార్టీపై దృష్టిపెట్టలేకపోతున్న తరుణంలో ఇది నష్టం కలిగిస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేఈకి శాఖ మార్చి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తప్పిస్తారని అనుకుంటున్నారు.