Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీకి మరో లెటర్ రాసిన కేసీఆర్.. ఈసారి విషయం ఏమంటే?

By:  Tupaki Desk   |   30 March 2022 4:33 AM GMT
ప్రధాని మోడీకి మరో లెటర్ రాసిన కేసీఆర్.. ఈసారి విషయం ఏమంటే?
X
అంతా ఓకే అనుకున్నంత వరకు సరే. కానీ.. చిన్నపాటి తేడా వచ్చినంతనే తానేమిటో చూపించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ మీద కారాలు.. మిరియాలు నూరటం తెలిసిందే.

ఏ చిన్న అవకాశం వచ్చినా విడిచిపెట్టకుండా విరుచుకుపడుతున్న ఆయన.. తరచూ ఏదో ఒక విమర్శను ఎక్కు పెడుతున్నారు. ఇటీవల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఆయన.. తాజాగా మరో లేఖను సంధించారు.

ఉక్రెయిన్ - రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల భవిత గురించి ఆలోచించాలని.. నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన కోరారు. విద్యార్థుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి హితవు పలికే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము తీసుకున్న నిర్ణయాన్ని చెబుతూ.. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన గొప్పల్ని చెప్పుకునే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది.

ఇంతకూ ఆయనేమన్నారంటే.. ఉక్రెయిన్ నుంచి వచ్చిన 700 మంది తెలంగాణ వైద్య విద్యార్థులు తమ కోర్సుల్ని పూర్తి చేయకుండానే యుద్దం కారణంగా స్వదేశానికి వచ్చేశారన్నారు. ఈ నేపథ్యంలో వారి కోర్సుల పూర్తికి ఫీజులు చెల్లించాలన్న నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

తమ మాదిరే కేంద్ర ప్రభుత్వం సైతం త్వరగా నిర్ణయాల్ని తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఫీజుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన బేషుగ్గా ఉన్నప్పటికీ.. ఆయన కోరుకున్నట్లే ప్రధాని నరేంద్ర మోడీ వైద్య విద్యార్థుల విషయంలో ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.