Begin typing your search above and press return to search.

పెళ్లి కూతుర్ని చేసిన దత్తపుత్రిక కు.. కేసీఆర్ సతీమణి ఏమిచ్చారు?

By:  Tupaki Desk   |   28 Dec 2020 6:59 AM GMT
పెళ్లి కూతుర్ని చేసిన దత్తపుత్రిక కు.. కేసీఆర్ సతీమణి ఏమిచ్చారు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఈ రోజు ఆమె పెళ్లి. రంగారెడ్డి జిల్లాలోని చర్చిలో ఆమె వివాహం జరుగుతోంది. అయితే.. గడిచిన రెండు రోజులుగా ఆమెను పెళ్లి కుమార్తెను చేస్తున్నారు. పెళ్లికి మూడు రోజుల ముందు నుంచి పెళ్లికుమార్తెను చేయటం సంప్రదాయంగా వస్తున్నదే. ఈ సందర్భంగా పెళ్లి కుమార్తెకు పుట్టింటి వారు బహుమతులు ఇస్తుంటారు.

సవతి తల్లి చేతుల్లో నరకం చూసిన ప్రత్యూష గురించి మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించిన కేసీఆర్ కదిలిపోవటమే కాదు.. ఆమెను ప్రత్యేకంగా ప్రగతిభవన్ కు పిలిపించుకోవటమే కాదు..ఆమెను దత్తపుత్రికగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అందుకు తగ్గట్లే.. ఆమెకు సంబంధించిన అన్నిఅంశాల్ని వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. ఆమెకు పెళ్లి సంబంధం వచ్చిన సందర్భంలోనూ.. సొంత కుమార్తెకు ఏ రీతిలో అయితే.. జాగ్రత్తలు తీసుకుంటారో.. అదే రీతిలో నిఘా విభాగం వారి నుంచి వరుడి గురించి సమాచారం సేకరించి.. అన్ని బాగున్నాయన్న తర్వాతే పెళ్లికి ఓకే చెప్పారు.

హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా సేవలు అందిస్తున్న ప్రత్యూషకు నగరానికి చెందిన యువకుడితో ఈ రోజు పెళ్లి ఫిక్స్ కావటం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఉన్నారు. పెళ్లి సందర్భంగా పెళ్లి కుమార్తెను చేసే కార్యక్రమాన్ని ఆ శాఖకు చెందిన మహిళా అధికారులే చేస్తున్నారు. ఆదివారం ఆమెను పెళ్లికుమార్తెను చేసిన సందర్భంగా.. ముఖ్యమంత్రి సతీమణి శోభమ్మతో పాటు.. మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తమ దత్తపుత్రికను పెళ్లి కుమార్తెగా చేసిన నేపథ్యంలో ఆమెను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్ సతీమణి.. ఆమెకు పుట్టింటి వారి తరపున పట్టుబట్టల్ని.. డైమండ్ నెక్లెస్ ను బహుమానంగా అందజేయటం గమనార్హం. దత్త కూతురంటే.. ఏదో దత్త కూతురు అన్నట్లు కాకుండా.. వ్యక్తిగత శ్రద్ధతో పాటు.. అదే స్థాయిలో అభిమానాన్నిప్రదర్శించిన వైనం అందరిని ఆకట్టుకుంటుందని చెప్పక తప్పదు.