Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లే కాదు.. సీఎం కేసీఆరూ ఊరెళ్లారు

By:  Tupaki Desk   |   11 April 2019 5:02 AM GMT
ఆంధ్రోళ్లే కాదు.. సీఎం కేసీఆరూ ఊరెళ్లారు
X
పండక్కి ఊరుకు వెళ్లటం ఇప్పటివరకూ చూశాం. కానీ.. ఓటు వేయటానికి ఊరెళ్లటం.. అది కూడా లక్షలాదిగా తరలివెళ్లటం ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ రణం భారీ స్థాయిలో ఉండటం.. ప్రతి ఓటు గెలుపునకు కీలకంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి లక్షలాది మంది ఓటర్లు ఏపీలోని తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిన వైనం తెలిసిందే.

ధనిక.. పేద అన్న తేడా లేకుండా ఓట్లు వేయటానికి ఊరెళ్లేందుకు పడిన తపన ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. హైదరాబాద్ లోని నగరజీవి ఓటు వేయటానికి ఎప్పుడూ ఆసక్తి చూపరన్న అపవాదు ఉంది. కానీ.. అందుకు భిన్నంగా హైదరాబాద్ లోని లక్షలాది మంది నగరానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ సొంతూళ్లలో ఓటు వేయటానికి ఊరెళ్లిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ నుంచి వెళ్లిన ఆంధ్రోళ్ల ఓట్లు ఏపీ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయటం ఖాయమని చెప్పక తప్పదు. ఓట్ల పండక్కి ఊరెళ్లిపోయారంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. అది హైదరాబాద్ లోని ఆంధ్రోళ్లు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే కోవకు రావటం విశేషం.

ఎందుకంటే.. కేసీఆర్ ఓటు ఆయన ఉండే హైదరాబాద్ లో కాకుండా ఆయన సొంతూరులో ఉండటమే. సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో సీఎం దంపతులకు ఓటు ఉంది. దీన్ని వినియోగించుకోవటానికి వీలుగా వారు ఈ రోజు ఉదయం (గురువారం) హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో చింతమడక గ్రామానికి వెళ్లారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేస్తారు.

రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ సొంతూరుకు వెళ్లటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. హైదరాబాద్లోని లక్షలాది మంది ఆంధ్రోళ్లు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తాముండే హైదరాబాద్లో ఓటు ఉండకపోవటం గమనార్హం. బతకటానికి వచ్చే ఊరు.. బతికించే ఊరు కంటే కూడా జన్మనిచ్చిన ఊరు మీద ప్రేమ లెక్కే వేరు.