Begin typing your search above and press return to search.

సారు సీరియస్.. సోషల్ మీడియాకు వార్నింగ్

By:  Tupaki Desk   |   26 Jan 2020 9:54 AM IST
సారు సీరియస్.. సోషల్ మీడియాకు వార్నింగ్
X
ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడూ నోటి వెంట మాట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా సమకాలీన రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నేతకు తెలీదని చెప్పాలి. తాను మాట్లాడాల్సిన సమయంలో ఎక్కడున్నా.. మీడియా ముందుకు వచ్చే ఆయన.. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్న ఏ ఒక్క సమయంలోనూ ఆయన మీడియా ముందుకు రాకుండా ఉండటమే కాదు.. ఎంతలా ప్రయత్నించినా మీడియాకు అందుబాటులోకి రాని విలక్షణత ఆయన సొంతం.

తాజాగా పుర ఎన్నికల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన కేసీఆర్.. గెలుపు ఊపులో.. విజయానందంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఎప్పటిలానే.. ఆయన ప్రెస్ మీట్ గంట దాటిపోయింది. తన మీద వచ్చే విమర్శలపై విరుచుకుపడటమే కాదు.. రాజకీయ ప్రత్యర్థులపై ఫైర్ అయ్యారు. విజయం దక్కిన ప్రతిసారీ మరింత బాధ్యతగా వ్యవహరించాలన్న సందేశం ఇస్తే కేసీఆర్.. ఈసారీ అలాంటి మెసేజ్ నే పార్టీ క్యాడర్ కు ఇచ్చారు.

రాజకీయ ప్రత్యర్థుల్ని.. ప్రతిపక్షాలకు భారీగా పంచ్ లు వేసిన ఆయన.. సోషల్ మీడియా ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఆయన సోషల్ మీడియా మీద కీలక వ్యాఖ్యలు చేశారు. తన మీద జరుగుతున్న ప్రచారాల గురించి ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియాలో కూడా తన మీద దుర్మార్గమైన ప్రచారం చేశారన్న ఆయన.. అది సోషల్ మీడియానా? యాంటి సోషల్ మీడియానా? అన్న ప్రశ్న మాత్రమే కాదు.. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుందో ఆలోచన చేయాలంటూ కీలక వ్యాఖ్య చేశారు.

సోషల్ మీడియా తన హద్దులు దాటకుండా ఉండేందుకు తాను రానున్న రోజుల్లో వ్యవహరిస్తానన్న విషయాన్ని చెప్పేశారు. సోషల్ మీడియాలో హద్దులు దాటే తీరును అరికట్టటానికి ఏం చేయాలో తామూ ఆలోచన చేస్తున్నట్లు చెప్పిన కేసీఆర్.. ఇప్పటిదాకా సహించాం కానీ ఇక నుంచి మాత్రం చాలా కఠినంగా ఉండనున్నట్లు స్పష్టం చేశారు.

ఎవరైనా సరే.. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు బంద్ చేయకుంటే.. కొండ మీద గోపీ అయినా కఠినంగా వ్యవహరిస్తామని.. ఇలాంటి బ్యాడ్ కల్చర్ ను పెంచటం ఏ మాత్రం సరికాదన్నారు. ఇప్పటికే రాజకీయాల మీదా నాయకత్వాల మీదా ప్రజలకు అసహ్యం కలుగుతుందన్న ఆయన.. ఇప్పటికే పేపర్ కార్టూన్లం అయిపోయాం.. ఇంకా పెద్ద కార్టూన్లు అయ్యే పరిస్థితి తెచ్చుకుందామా? అని ప్రశ్నించిన ఆయన.. అదెప్పుడో అయిపోయారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించలేదా? అన్న అనుమానం కలుగక మానదు.

అడ్డూ అదుపూ లేకుండా.. మర్యాద.. సంస్కారం లాంటివి పక్కన పెట్టి మాట్లాడుతున్న తీరును ఉపేక్షించేది లేదన్న కేసీఆర్ మాటలు చూస్తే.. సారుకు సోషల్ మీడియా మీద మస్తు గుర్రుగా ఉన్నరన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలన్న వేళ.. సోషల్ మీడియా మీద నిప్పులు చెరుగుతున్న సారు.. ఆ విషయంలో మరోసారి పునరాలోచన చేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.