Begin typing your search above and press return to search.

ముంద‌స్తుకు మొగ్గు చూపుతున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   4 Jan 2018 3:30 PM GMT
ముంద‌స్తుకు మొగ్గు చూపుతున్న కేసీఆర్
X
చూస్తున్నంత‌నే కాలం క‌రిగిపోయింది. వేగంగా మారిన జీవ‌న‌శైలితో సంవ‌త్స‌రాలు నెల‌లు మాదిరి గ‌డిచిపోతున్నాయి. ఇక‌.. నెల‌లైతే వారాలుగా.. వారాలు రోజులుగా మారిపోయాయి. నెల మొద‌లై.. కాస్త ఒళ్లు విరుచుకొని క్యాలెండ‌ర్ లోకి చూసేస‌రికి.. ప‌దిహేనో తారీఖు వ‌చ్చేస్తున్న ప‌రిస్థితి. నిన్న మొన్న‌న‌నే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన‌ట్లుగా అనిపిస్తున్న‌ప్ప‌టికీ... మ‌రో ఏడాదిన్న‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు మ‌రోసారి వ‌చ్చేస్తున్నాయి.

తెలంగాణ గ‌డ్డ మీద పాతికేళ్లు మాదే అధికారం అన్న భావ‌న‌లో ఉన్న గులాబీ ద‌ళ ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్లే.. ఆ పార్టీ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహర‌చ‌న చేస్తున్నారు. సుదీర్ఘ‌కాలం ఉద్య‌మ నేత‌గా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌.. త‌న జీవిత‌ల‌క్ష్య‌మైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ‌ట‌మే కాదు.. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా రికార్డుల్లోకి ఎక్కేశారు.

ఇప్పుడాయ‌న ల‌క్ష్యం రానున్న మ‌రో 20 ఏళ్లు పార్టీని అధికారంలో ఉంచ‌ట‌మే. అందుకు త‌గ్గ‌ట్లే ప్లాన్లు వేస్తున్న ఆయ‌న‌.. లోటుపాట్లు జ‌నం దృష్టికి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. కొండ‌లా పెరిగిపోతున్న రాష్ట్ర రుణ‌భారం నొప్పి తెలీకుండా బండి లాగిస్తున్న ఆయ‌న.. ముంద‌స్తు మీద దృష్టి సారించారా? అంటే.. అవున‌న్న స‌మాధానాన్ని ప‌లువురు చెబుతున్నారు. ఎందుకిలా? అంటే.. దాని లెక్క‌లు చాలానే ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ప‌రిస్థితులు ఇప్పుడు అనుకూలంగా ఉండ‌టం.. ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌హీనంగా ఉండ‌టంతో లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండా.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళితే మంచిద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో గులాబీ బ‌లాన్ని మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని కేసీఆర్ త‌పిస్తున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్ర‌.. రాష్ట్ర ఎన్నిక‌లు ఒకేసారి జ‌రిగితే.. కొన్నిసార్లు జాతీయ అంశాలు ఎంతోకొంత స్థానిక రాజ‌కీయాల మీద ప్ర‌భావం చూపే వీలుంది. అదే.. వేర్వేరుగా జ‌రిగితే.. విభ‌జించి పాలించు అన్న రీతిలో రాజ‌కీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవ‌చ్చ‌న్న భావ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతారు. ముంద‌స్తుకు వెళితే లాభ‌న‌ష్టాల బేరీజు ఇప్ప‌టికే పూర్తి అయ్యింద‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ముంద‌స్తుకు వెళ్ల‌టానికి మించిన అప్ష‌న్ మ‌రొక‌టి లేద‌న్న భావ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఏడాది ముందే ఎన్నిక‌ల‌కు వెళితే ఎలా ఉంటుంద‌న్న అంశంపై క‌స‌ర‌త్తు చేసిన ఆయ‌న‌.. ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని మ‌రింత వేగంగా పూర్తి చేయాల‌న్న ఆదేశాల్ని అధికారుల‌కు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మ‌రింత వేగంగా పూర్తి కావాలంటే.. ప్ర‌భుత్వ అధికారుల చేయూత చాలా ముఖ్య‌మ‌న్న ఉద్దేశంతోనే.. ఐఏఎస్ బ‌దిలీలు పూర్తి చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని జెట్ స్పీడ్ లో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేరుస్తార‌న్న న‌మ్మ‌కం ఉన్న అధికారులకు పెద్ద‌పీట వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ప‌రిణామాలు సానుకూలంగా ఉన్న నేప‌థ్యంలో.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త రాక ముందే ముంద‌స్తు ఎన్నిక‌లు ముగిస్తే.. ఆ ఎన్నిక‌లతో వ‌చ్చే బ‌లంతో సార్వత్రానికి సిద్ధం కావొచ్చ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం చూస్తే.. 2019 మార్చిలో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. దీంతో.. అంత‌కు ఆరు నెల‌ల ముందే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తి అయ్యే అంశంపై దృష్టి సారించిన‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఈ ప్లాన్ లో ఏదైనా స‌మ‌స్య ఉందంటే..ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించేన‌ని.. అనుకున్న‌ట్లుగా ముంద‌స్తు విష‌యంలో ఏ మాత్రం తేడా దొర్లినా భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఈ అపాయాన్ని కేసీఆర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారా? లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కేసీఆర్ లాంటి వ్యూహ‌క‌ర్త ఏం ప్లాన్ చేసినా లాభం కంటే ముందు న‌ష్టాన్ని అంచ‌నా వేస్తార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తు దిశ‌గా కేసీఆర్ పావులు క‌దుపుతున్నార‌ని.. చివ‌రిక్ష‌ణంలో తెర మీద‌కు వ‌చ్చే ప‌రిణామాల ఆధారంగా ప్లాన్ లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే వీలుంది.