Begin typing your search above and press return to search.

కాళేశ్వరం చూసి ఉద్వేగానికి లోనైన కేసీఆర్.. కరీంనగర్‌ లో పర్యటన

By:  Tupaki Desk   |   13 Feb 2020 9:00 AM GMT
కాళేశ్వరం చూసి ఉద్వేగానికి లోనైన కేసీఆర్.. కరీంనగర్‌ లో పర్యటన
X
కోటి ఎకరాల మాగాణి లక్ష్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు గన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణను ఆకుపచ్చగా మారుస్తుందని భావించి ఆ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆగమేఘాల మీద పనులు చేయించారు. ఇప్పుడు పనులు ఆశించిన మేర పూర్తయి మూడేళ్లల్లోనే ప్రాజెక్ట్‌ అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఆ ప్రాజెక్ట్‌ ఫలాలు ఇప్పుడు తెలంగాణ అందుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌ దాక ఈ ప్రాజెక్ట్‌ నీళ్లు వెళ్లేలా సీఎం కేసీఆర్‌ ఇంజనీర్ల తో కలిసి చర్చించి ఈ ప్రాజెక్ట్‌ ను చేపట్టారు.

ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇక చేపట్టాల్సిన పనులపై సీఎం కేసీఆర్‌ అధికారులకు, ఇంజనీర్లకు నిర్దేశించనున్నారు. ఈ మేరకు కరీంనగర్‌ పర్యటనకు సీఎం కేసీఆర్‌ బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి పయనమయ్యారు. కరీంనగర్‌ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ బస చేశారు. గురువారం ఉదయం కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. తుపాకులగూడెం ఆనకట్టతో పాటు మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ ఆనకట్టను కూడా ఆయన పరిశీలించనున్నారు.

అంతకుముందు బుధవారం ప్రగతిభవన్‌లో ఈ ప్రాజెక్ట్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులతో ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నది. ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారినయి. రానున్న వానం కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీ కి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా అటునుంచి కాలువలకు మల్లించే దిశగా.. ఇర్రిగేషన్ శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం కావాలె. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలె’’ అని పేర్కొన్నారు.

తన మానసపుత్రికగా భావించే కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో కళ్లముందే గోదావరి పరవళ్లు తొక్కుతుంటే కేసీఆర్‌ పరమానందం పొందుతున్నారు. గోదావరి జలాలతో నిండుకుండలా ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిని చూసి కేసీఆర్‌ పరవశించిపోతున్నారు. తాను కలగన్న తెలంగాణ ఇది అని, ఉద్యమం లో ముఖ్యమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో నీటి అంశం సాకారమైందని కేసీఆర్‌ భావిస్తున్నారు.