Begin typing your search above and press return to search.
మొక్కు ఖర్చు కంటే తీర్చుడు ఖర్చే ఎక్కువైందే?
By: Tupaki Desk | 29 Jun 2018 10:37 AM ISTమానవసాధ్యం కాని పనులు దేవుడి కృపతో జరిగేలా చేసుకోవాలన్న ఉద్దేశంతో మొక్కుకోవటం మామూలే. అలా మొక్కుకున్న పనులు పూర్తి అయిన వెంటనే.. ముందు మొక్కులు తీర్చుకోవటం చాలామందిలో కనిపిస్తుంది. ధర్మశాస్త్రాలు మొదలు పురాణాలు.. ఇతరత్రా పుస్తకాలు విపరీతంగా చదివే అలవాటున్న కేసీఆర్.. తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే విభజన పూర్తై.. ఆయన స్వప్నమైన తెలంగాణ రాష్ట్ర సాక్షాత్కరించి నాలుగేళ్ల తర్వాత తన చివరి మొక్కును పూర్తి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
ఒకవేళ ఆర్థికంగా అంత సౌండ్ కాకుండా అదేం తప్పు కాదు.కానీ.. భారీ విస్తీర్ణంలో ఫాంహౌస్.. దాంట్లో పెద్ద ఎత్తున పంటలు పండిస్తూ.. రైతులకు ఆదర్శంగా నిలుస్తానంటూ.. తన సాగు ఆదాయం గురించి చెప్పే కేసీఆర్‌కు.. తన మొక్కుల్ని తీర్చుకోవటానికి ప్రజాధనం ఎందుకు ఖర్చు చేస్తారో ఓ పట్టాన అర్థం కాదు.
ఇదే విషయాన్ని కొందరు ప్రశ్నించినా.. వాటికి సమాధానం చెప్పటానికి ఇష్టపడని కేసీఆర్ తీరుతో.. సర్లే.. ఏం చేయగలమంటూ ఊరుకున్నారు. ఇక.. ప్రజాధనానికి ధర్మకర్తలమన్నట్లుగా మాటలు చెప్పే మీడియా సైతం.. అదేంది సారూ.. మీ మొక్కులకు ప్రజాధనాన్ని ఎలా ఉపయోగిస్తారు? అన్న ప్రశ్న వేసింది లేదు. పోనీ.. కేసీఆర్ చుట్టూ ఉండే పండితులు కానీ.. స్వాములోళ్లు కానీ కాస్తంత చొరవ తీసుకొని .. ప్రజాధనాన్ని మీ మొక్కుల కింద తీర్చే ప్రయత్నం చేసినా.. . మొక్కులు తీర్చిన లెక్క మీ ఖాతాలోకి పడదన్న మాటను చెప్పినట్లు కనిపించదు. ఎవరికి వారు మనకెందుకులే? అన్నట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది.
చూస్తూ.. చూస్తూ పవర్లో ఉన్న కేసీఆర్ తో పెట్టుకునే సాహసం చేస్తారా? అందుకే కాబోలు తనను ఎవరు ప్రశ్నించే ధైర్యం చేయరన్న ధీమానో.. ఒకవేళ చేసినా.. సెంటిమెంట్ మాటలతో అలాంటోళ్ల నోటిని మూస్తానన్న ధైర్యం కేసీఆర్‌లో ఎక్కువనే చెప్పాలి. 11 గ్రాముల బరువున్న ముక్కుపుడక మొక్క తీర్చటం కోసం కేసీఆర్ చేసిన ఖర్చు లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
తన వ్యక్తిగత మొక్కును తీర్చుకోవటానికి కుటుంబ సభ్యులందరితో కలిసి బయలుదేరిన కేసీఆర్.. తన వెంట మంత్రుల్ని.. పార్టీ నేతల్ని తీసుకెళ్లటం ఆసక్తికరం. వీరందరి ప్రయాణానికి ఉపయోగించిన ప్రత్యేక విమానానికి అయ్యే ఖర్చు ఎవరిందంటారు? ఇంకెవరిదీ.. ప్రజలదే. ఇంతేనా.. బెజవాడ వెళ్లిన కేసీఆర్ .. తన కాన్వాయ్‌ను అక్కడికి ముందు రోజు పంపిన ఖర్చు కూడా ప్రజలదే? మరీ.. మీ పిచ్చ కాకుంటే..స్వయంగా సీఎం తన మొక్కు తీర్చుకోవటానికి వెళితే.. ఈ పీనాసి లెక్కలేంది? తెలంగాణను.. రేపో.. మాపో బంగారు తెలంగాణ మార్చేసేందుకు అదే పనిగా కష్టపడుతున్న కేసీఆర్ చేసే ఖర్చుల్ని భూతద్దంలో చూస్తారా? అయినా.. రాజు.. సారీ ముఖ్యమంత్రి కాకుంటే సామాన్యుడు ఆ స్థాయిలో ఖర్చు చేస్తారా.. ఏంది? మరీ.. ఏడుపు కాకుంటే..!
