Begin typing your search above and press return to search.

మిత్రుడి రక్షణకోసం కేసీఆర్ చివరి ప్రయత్నం

By:  Tupaki Desk   |   1 Nov 2015 10:25 AM GMT
మిత్రుడి రక్షణకోసం కేసీఆర్ చివరి ప్రయత్నం
X
కష్టాలు సామాన్యంగా రావు. వస్తే ఒకటొకటిగా రావు అనేది సామెత. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పరిస్థితి అలాకే తయారైందిప్పుడు. గత కొన్ని రోజులుగా ఒకటి తర్వాత ఒకటిగా ఆటంకాలను ఎదుర్కొంటున్న కేసీఆర్ రాష్ట్రంలో మరో చిక్కు సమస్యను ఎదుర్కొన్నారు. పాలనాపరంగా తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరొందిన వ్యక్తి ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ దృష్టిలో పడ్డారు. కానీ అతడిని కాపాడటానికి చివరి ప్రయత్నంగా కేసీఆర్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద ఉద్యోగి సోమేష్ కుమార్ ఇన్నాళ్లు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ గా తిరుగులేని అధికారం చలాయించారు. ఈయనను కాపాడుకోవడానికే కేసీఆర్ శుక్రవారం రాత్రి 22 మంది ఐఏఎస్ అధికారులను ఉన్నట్లుండి బదిలీ చేసి పడేశారు. సోమేష్ కుమార్ బదిలీ వీటిలో అత్యంత కీలకమైంది.

రాజకీయంగా టీఆరెస్ పార్టీతరపున పనిచేశాడని సోమేష్ కుమార్‌ పై అనేక సార్లు అరోపణలు వచ్చాయి. ప్రత్యేకించి కీలకమైన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తెరాస విజయం కోసం సోమేష్ కుమార్ అడ్డగోలు కార్యక్రమాలు చేపట్టి పీకలదాకా మునిగిపోయాడు. సీమాంధ్రుల కీలక ఓట్లను తొలగించడం ద్వారా టీఆరెస్ పార్టీకి అనుకూలంగా ఓటర్ల జాబితానుంచి భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించిన సోమేష్ ఇప్పుడు అదే అంశంపై ఎన్నికల కమిషన్ తనిఖీలో చిక్కుకున్నారు.

ఇప్పటికే తనను ఆంద్రప్రదేస్ కోటాలో కలపొద్దంటూ క్యాట్ వద్ద మొరపెట్టుకున్న సోమేష్ ఆ కేసులో కూడా ఓడిపోయేటట్లు ఉన్నాడని సమాచారం. ఎన్నికల కమిషన్ దర్యాప్తునుంచి సోమేష్ కుమార్‌ ను కాపాడుకునేందుకు చేసిన చివరి ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ తన మిత్రుడు సోమేష్‌ ను జీహెచ్ ఎంసీ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి, అంతగా ప్రాచుర్యంలో లేని గిరిజన సంక్షేమ శాఖకు పంపారని తెలుస్తోంది.