Begin typing your search above and press return to search.

కేసీఆర్ పర్యటన రద్దు.. కారణం తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   6 Jun 2021 5:30 AM GMT
కేసీఆర్ పర్యటన రద్దు.. కారణం తెలిస్తే షాకే
X
సెంటిమెంట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. కీలక నిర్ణయాలు తీసుకోవటానికి ఆయన తన లక్కీ నెంబరు ఆరును అస్త్రంగా ప్రయోగిస్తుంటారు. అందుకు తగ్గట్లే.. ఆయన సక్సెస్ అవుతుంటారు. దీంతో.. ఆయన నమ్మకాలు మరింతగా పెరుగుతున్నాయి. నమ్మకాలు ఉండటం తప్పేం లేదు కానీ.. స్థాయి దాటితేనే తిప్పలు. తాజా ఉదంతం గురించి తెలిస్తే అవాక్కు కావటం ఖాయం.

ముందుగా డిసైడ్ చేసిన షెడ్యూల్ ప్రకారం కామారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి కార్యక్రమాలన్ని కూడా షెడ్యూల్ అయ్యాయి. ఈ నెల 10 కామారెడ్డి జిల్లాకు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్.. పోలీసు కార్యాలయ భవనాల్ని ప్రారంభించాల్సి ఉంది.

తాజాగా ఆ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా తేల్చారు. ఎందుకిలా? ఏమైందంటూ ఆరా తీసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యే సమాధానం బయటకు వచ్చింది. అధికారులు నిర్ణయించిన పదో తారీఖు అమావాస్య. ఈ విషయాన్ని గుర్తించకుండానే కేసీఆర్ ప్రోగ్రాంను డిసైడ్ చేశారు. సెంటిమెంట్లకు అమితంగా ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. అమావాస్య రోజున కొత్త భవనాల్ని ఎలా ఓపెన్ చేస్తారు? అందుకే.. ఆ టూర్ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేశారు.

ఈ విషయాన్ని మరెవరో చెబితే నమ్మలేం కానీ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి నోటి నుంచి రావటం గమనార్హం. పదో తారీఖు ప్రారంభం కావాల్సిన భవనాల్ని మరోసారి సీఎం ప్రారంభిస్తారని.. త్వరలోనే డేట్ డిసైడ్ చేస్తారని చెబుతున్నారు. నమ్మకాలకు కేసీఆర్ ఎంత ప్రయారిటీ ఇస్తారన్న విషయం తాజా ఎపిసోడ్ మరోసారి ప్రూవ్ చేసిందని చెప్పక తప్పదు.