Begin typing your search above and press return to search.

బెజవాడలో కేసీఆర్ ?

By:  Tupaki Desk   |   5 Dec 2015 11:21 AM IST
బెజవాడలో కేసీఆర్ ?
X
తనకు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన మర్యాదలను తిరిగిచ్చేసి రుణం తీర్చుకోవాలని తొందరపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకోసం ఆయుత చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించబోతున్న సంగతి తెలిసిందే. మొన్న టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆహ్వానిస్తారనుకున్నా ఆ రోజు ఇద్దరూ కలుసుకోలేదు. దీంతో ఇప్పుడు కొత్త ఊహాగానాలు వస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ లో ఎన్టీఆర్ మునిమనమరాలి పెళ్లికి చంద్రబాబు వస్తారని.. అప్పుడు ఆహ్వానం ఇవ్వాలని అనుకుంటున్నారని వినిపిస్తోంది. అదే సమయంలో ఇంకో వాదనా వినిపిస్తోంది. కేసీఆర్ నేరుగా విజయవాడ వెళ్లి చంద్రబాబును ఆహ్వానిస్తారని కొందరు చెబుతున్నారు.

అమరావతి శంకుస్థాపనకు తనను ఇంటికి వచ్చి మరీ పిలిచిన చంద్రబాబును తాను కూడా అంతే గౌరవంగా పిలవాలని కేసీఆర్ అనుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వెళ్లి చంద్రబాబును పిలుచుకువస్తారంటున్నారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ తీసుకుని విజయవాడ వెళ్తానని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు టీఆరెస్ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు కూడా ఆయుత చండీయాగానికి కచ్చితంగా హాజరవుతారని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఆ పనిమీద హైదరాబాద్ లోనే ఉండే చంద్రబాబు చండీయాగానికి తప్పకుండా వస్తారని కేసీఆర్ అన్నారని తెలుస్తోంది. చంద్రబాబును పిలిచేందుకు కేసీఆర్ మరోసారి విజయవాడ వెళ్తే అది మంచి పరిణామమే అవుతుంది.