Begin typing your search above and press return to search.

కేసీఆర్ మ‌రో యాగం - ఈసారి దిల్లీలో!

By:  Tupaki Desk   |   27 Jan 2019 7:54 AM GMT
కేసీఆర్ మ‌రో యాగం - ఈసారి దిల్లీలో!
X
వ‌రుస యాగాల నిర్వ‌హ‌ణ‌తో యాగ పురుషుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి - గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ మ‌రో య‌జ్ఞానికి త్వ‌ర‌లో శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ సారి ఏకంగా దేశ రాజ‌ధాని దిల్లీలో యాగం నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు రూపొందించుకున్న‌ట్లు టీఆర్ ఎస్ విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని కేసీఆర్ యోచిస్తున్న‌సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ త‌దిత‌ర కీల‌క నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ప‌లు ఇత‌ర పార్టీల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

అయితే - తాను అనుకున్న‌ది సాధించాలంటే మాన‌వ ప్ర‌య‌త్నంతోపాటు దైవ స‌హాయం కూడా అవ‌స‌ర‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. అందులో భాగంగానే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ స‌క్సెస్ కోసం ప్ర‌త్యేక యాగం నిర్వ‌హించాల‌ని విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వామి స్వ‌రూపానందేంద్ర స్వామి స‌ల‌హా మేర‌కు నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దేశ రాజ‌కీయాల‌కు ముడి ప‌డి ఉన్న‌ది కావ‌డంతో ఆ యాగాన్ని దేశ రాజ‌ధాని దిల్లీలోనే నిర్వ‌హించేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించేందుకుగాను స్వ‌రూపానందంద్ర స్వామి సూచ‌న మేర‌కు కేసీఆర్ రాజ‌శ్యామ‌ల యాగం చేశారు. ఎన్నిక‌ల్లో అద్భుత‌ విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత త‌మ పార్టీ విజ‌యానికి కృత‌జ్ఞ‌త‌గా మ‌హారుద్ర స‌హిత స‌హ‌స్ర చండీయాగం చేశారు.

వీట‌న్నింటికంటే ముందు అయిత చండీయాగం కూడా చేశారు. ఇవ‌న్నీ కేసీఆర్ లోని ఆధ్యాత్మిక భావ‌న‌ల‌కు అద్దం ప‌ట్టాయి. అయితే - ఈ యాగాల‌న్నీ ఎర్ర‌వ‌ల్లిలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రం కేంద్రంగా జ‌రిపించిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ విజ‌యం కోసం దిల్లీలో యాగం చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. యాగం స‌ఫ‌ల‌మైతే ఫెడ‌రల్ ఫ్రంట్ విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని.. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల అనంత‌రం కేంద్రంలో చ‌క్రం తిప్ప‌వ‌చ్చున‌ని స్వ‌రూపానందేంద్ర స్వామి కేసీఆర్ కు వివ‌రించిన‌ట్లు స‌మాచారం. వచ్చే నెల చివ‌రి వారంలోగానీ, మార్చి తొలి వారంలోగానీ కేసీఆర్ దిల్లీలో యాగం చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.