Begin typing your search above and press return to search.

తెలంగాణలో కలెక్టర్ పేరు మారినట్లే

By:  Tupaki Desk   |   13 April 2019 11:22 AM IST
తెలంగాణలో కలెక్టర్ పేరు మారినట్లే
X
ఏళ్లకు ఏళ్లుగా ఉన్న వ్యవస్థల్ని మార్చటం.. తాజా పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుకోవటం అంత తేలికైన విషయం కాదు. దీనికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి వాటి విషయంలో అదే పనిగా మేథోమధనం చేస్తూ.. ఆసక్తికర నిర్ణయాలు తీసుకోవటంలో దిట్ట అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అంశాన్ని టార్గెట్ చేశారు.

మామూలుగా అయితే.. ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తుంటే.. మీడియా ఎటకారం చేసుకోవటం.. ఎవరికి వారు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారే అంటూ వ్యంగ్యస్త్రాల్ని సంధించటం మామూలే. కానీ.. ఇలాంటివి ఇంకెక్కడైనా జరుగుతాయేమో కానీ తెలంగాణలో జరగవని చెప్పాలి. చేసే పని మీద పూర్తి అవగాహన.. దానిపై వెల్లువెత్తే విమర్శలు.. వాటికి పెట్టాల్సిన చెక్ విషయంలో కేసీఆర్ కసరత్తు భలేగా ఉంటుందని చెప్పక తప్పదు. తాజాగా రెవెన్యూశాఖ మీద ఫోకస్ పెట్టిన ఆయన.. ఆ శాఖను దాదాపుగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

కీలకమైన ఎన్నికల సమయంలోనే.. దీని మీద ఒక క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన పక్క రోజునే కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లంచాల్లేని వ్యవస్థను తీసుకురావాలన్న కొత్త కలను ఆవిష్కరించిన ఆయన.. పైసా లంచం తీసుకోకుండా పనులు చేసేలా ప్రభుత్వ కార్యాలయాలు మారాలన్న సంకల్పాన్ని ఆయన చెప్పుకొచ్చారు.

రెవెన్యూ కార్యాలయం.. పురపాలక.. గ్రామ పంచాయితీల్లో ఎక్కడా.. ఎవరికి పైసా ఇవ్వకుండా పని చేయించుకునే పరిస్థితి రావాలన్నారు. ఇందుకు అవసరమైన కఠినమైన చట్టాల్ని తీసుకొచ్చే ప్రయత్నంలో తానున్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏదో మాట వరసకు కాకుండా.. కఠినమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని.. కొత్త పురపాలక చట్టాన్ని తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.

ధ్రువపత్రాల జారీ విషయంలో ఆలస్యం ఉండకూడదని.. లేట్ అయితే అందుకు కారణమైన వారికి ఫైన్ వేసే పద్దతి రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన కేసీఆర్.. అధికార యంత్రాంగం మొత్తం ప్రజలకు జవాబుదారీతనంలో వ్యవహరించాలంటూ ప్రజలకు మెచ్చే మాటను చెప్పారు.

తాను చేస్తున్న మార్పులన్నీ కూడా ప్రజల కోసమేనని.. వారికి మరింత సదుపాయంగా ఉండటమే కాదు.. వేధింపులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలన్న తీరు ఉద్యోగులకు కన్నెర్రగా ఉన్నా.. ప్రజామోదం వారిని భయపడేలా చేస్తుందని చెప్పాలి. రెవెన్యూ చట్టాల మీద ఫోకస్ పెట్టిన కేసీఆర్.. కలెక్టర్ పేరును కూడా మార్చాలన్న ఆలోచనలో ఉన్నారు.

కలెక్టర్ పేరు భూమిశిస్తు వసూలు వంటివి చేసే టైంలో పెట్టుకున్న పేరు అని.. దానికి మరో పేరు పెట్టాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. నిజమే.. కలెక్టర్ అన్న పేరుకు శిస్తును వసూలు చేసే వాడు అని. కానీ.. ఇప్పుడు కలెక్టర్ ఆ పనే చేయరు. అలాంటప్పుడు పాత వాసనల్ని.. పురాతన పద్దతులకు చెక్ పెట్టి.. కొత్తగా.. డైనమిక్ గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే కేసీఆర్ అడుగులు పడుతున్నాయని చెప్పక తప్పదు.