Begin typing your search above and press return to search.

కేసీఆర్ డేరింగ్!... బాబుకు దెబ్బ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   24 Feb 2018 5:30 AM GMT
కేసీఆర్ డేరింగ్!... బాబుకు దెబ్బ త‌ప్ప‌దా?
X
ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌రిచిపోవ‌డం రాజ‌కీయ పార్టీల‌కు అలవాటే. అంతెందుకు దేశ రాజ‌కీయాల‌ను ఓ సారి ప‌రిశీలించి చూస్తే... ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్క‌డం త‌మ జ‌న్మ‌హ‌క్కుగా రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌న‌కు క‌నిపించ‌క మాన‌దు. అయితే ఇచ్చిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌నే కాకుండా అప్ప‌టిదాకా త‌మ మ‌దిలోనే లేని స‌రికొత్త సంక్షేమ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టిన నేత‌లు కూడా లేక‌పోలేదు. ఈ కోవ‌లో తెలుగు నేల రాజ‌కీయాల‌ను తీసుకుంటే... ఈ త‌ర‌హా రాజ‌కీయ నేత‌లుగా టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు - దివంగ‌త సీఎం - ప్ర‌జ‌ల హృద‌యాల్లో మ‌హానేత‌గా మిగిలిపోయిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిల‌ను చెప్పుకోవ‌చ్చు. ఈ ఇద్ద‌రు నేత‌లు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ప‌క్కాగా అమ‌లు చేయ‌డంతో పాటుగా కొత్త‌గా చాలా సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రారంభించి ప‌క్కాగానే అమ‌లు చేశార‌ని చెప్పాలి. అందుకే వారిద్ద‌రికీ జ‌నాల మ‌దిలో చిర‌స్థానం ల‌భించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి ఇప్ప‌టి తెలుగు నేల రాజ‌కీయాల‌ను చూస్తే... చాలా వైరుధ్యం క‌నిపించ‌క మాన‌దు. ముందుగా ఏపీ విష‌యాన్ని తీసుకుంటే... గ‌డ‌చిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగిన టీడీపీ... అధికారంలోకి వ‌చ్చేది వైసీపీనేన‌న్న భావ‌న‌తో బెంబేలెత్తిపోయింద‌నే చెప్పాలి.

అయితే వైసీపీకి అధికారం అంద‌కుండా చేసేందుకు త‌న‌దైన వ్యూహాల‌కు ప‌దును పెట్టిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు లెక్కలేన‌న్ని హామీలు ఇచ్చారు. బాబు వ‌స్తే.. జాబు వ‌చ్చిన‌ట్టే, జాబు లేని వారికీ భ‌రోసా నిరుద్యోగ భృతి, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు, బెల్టు షాపుల ఎత్తివేత‌, రైతులు, డ్వాక్రా సంఘాల‌కు రుణ‌మాఫీ వంటి చాలా హామీల‌నే టీడీపీ ప‌లికింది. ఆ క్ర‌మంలో చాలా నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ అదికారంలోకి వ‌చ్చింది. అయితే మాట మార్చ‌డం త‌న జ‌న్మ‌హ‌క్కు అన్న చందంగా వ్య‌వ‌హరించిన చంద్ర‌బాబు స‌ర్కారు... ఇచ్చిన హామీల్లో నెర‌వేర్చిన‌వి ఎన్ని అన్న మాట చెప్పేందుకే భ‌య‌ప‌డిపోతోంద‌న్న వాద‌న లేక‌పోలేదు. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే... ఉద్య‌మ పార్టీగా తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించ‌డంలో కీల‌క భూమిక పోషించిన పార్టీగా టీఆర్ఎస్‌కు ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఎన్నికల్లో పెద్ద‌గా హామీలేమీ ఇవ్వ‌కుండానే కేసీఆర్‌కు అధికారం ద‌క్కింద‌నే చెప్పాలి. అయితే ఉద్య‌మ స‌మ‌యంలో, ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కాకుండా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా సంద‌ర్భాల్లో ప‌లు అంశాల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్.. వాటిని అమ‌లు చేసుకుంటూ వెళ్లారు. అర‌కొర విష‌యాల్లో మాత్రం కేసీఆర్ కాస్తంత వెనుక‌బ‌డ్డా... చాలా హామీల‌ను అమ‌లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్పుడు తెలంగాణ స‌ర్కారులో జోరుగా చ‌ర్చ సాగుతున్న ఓ అంశం గ‌నుక కార్య‌రూపం దాలిస్తే... మాత్రం కేసీఆర్‌కు ఇక తిరుగే ఉండ‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. అదేంటంటే... ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఉద్యోగాలు ల‌భించ‌ని యువ‌త‌కు నిరుద్యోగ భృతి ఇవ్వాల‌న్న‌దే. ఈ భృతి కింద 18-30 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.2000 ఇస్తార‌ట‌. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 10 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులున్నార‌ని భావిస్తే... ఈ లెక్క‌న ప్ర‌భుత్వంపై నెల‌కు రూ.200 కోట్లు, ఏడాదికి రూ.2,400 కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌నుంద‌ట‌. ప్రస్తుతానికి దీనిపై అధికార యంత్రాంగం ముమ్మ‌రంగా క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని, వ‌చ్చే బ‌డ్జెట్ లో కేసీఆర్ దీనిని ఘ‌నంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామ‌కాలు... ఆధారంగానే ఉద్య‌మం సాగించిన కేసీఆర్‌... నీళ్లు -నిధుల సాధ‌న విష‌యంలో విజ‌యం సాధించార‌నే చెప్పాలి. అదే స‌మ‌యంలో నియామ‌కాల విష‌యంలో మాత్రం కేసీఆర్ కాస్తంత వెనుక‌బ‌డ్డార‌నే చెప్పాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌న్నింటినీ భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌... ఆ దిశ‌గా పెద్ద‌గా సాధించిందేమీ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌భుత్వం నుంచి ఆశించిన మేర భ‌ర్తీ నోటిఫికేష‌న్లు రాలేద‌ని, వ‌చ్చిన నోటిషికేష‌న్ల‌లోనూ అర‌కొర నియామ‌కాలు జ‌రిగాయ‌ని యువ‌త భావిస్తోంది. ఈ క్ర‌మంలో నిరుద్యోగ భృతి గ‌నుక అమ‌లులోకి వ‌స్తే... కేసీఆర్ పై యువ‌త‌లోని వ్య‌తిరేక‌త త‌గ్గిపోవ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇదే గ‌నుక జ‌రిగితే... తెలంగాణలో కేసీఆర్ కు తిరుగు లేని ప‌రిస్థితి ఖాయ‌మే. అదే స‌మ‌యంలో కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం ఏపీలో చంద్ర‌బాబుకు బ్యాండు ప‌డిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే... గ‌త ఎన్నిక‌ల్లో నిరుద్యోగ భృతి అంటూ డాంబికాలు ప‌లికిన చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాని ఊసే ఎత్త‌లేదు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించిన యువ‌భేరీల్లో ఇదే విష‌యంపై త‌నదైన శైలిలో గ‌ళం విప్పారు. రాష్ట్ర యువ‌త‌కు చంద్ర‌బాబు ఇంత‌మేర బాకీ ప‌డ్డారంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ వెన్నులో వ‌ణుకు పుట్టించాయ‌నే చెప్పాలి. జ‌గ‌న్ మాట‌తో అప్ప‌టిక‌ప్పుడు ఈ అంశాన్ని ముందేసుకున్న టీడీపీ... ఆ దిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్లుగా కూడా వార్త‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో హామీ ఇవ్వ‌కున్నా... కేసీఆర్ నిరుద్యోగ భృతిని ప్ర‌వేశ‌పెడితే... హామీ ఇచ్చి కూడా నిరుద్యోగ భృతిని అమ‌లు చేయ‌ని బాబుకు మాత్రం బ్యాండు ఖాయ‌మేన‌న్న వాద‌న వినిస్తోంది.