Begin typing your search above and press return to search.

కోడ్ అమలుకు కేసీఆర్ మర్యాదకు లింకెట్టేశారు

By:  Tupaki Desk   |   21 Feb 2017 4:40 AM GMT
కోడ్ అమలుకు కేసీఆర్ మర్యాదకు లింకెట్టేశారు
X
కొన్నిసార్లు మహా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి క్లిష్టమైన సమయాల్ని చూసినప్పుడు ఏం చెప్పాలో అర్తం కాని పరిస్థితి. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న అనుభవం తిరుపతి రెవెన్యూఅధికారులకు ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి తిరుమలకు వస్తున్న వేళ.. ఆయనకు ఘనంగా స్వాగతం పలకటం కోసం భారీగా ఫ్లెక్సీలు.. పోస్టర్లు ఏర్పాటు చేసిన స్వాగతం పలికేలా ప్లాన్ చేశారు.

రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసిన కేసీఆర్ ను గ్రాండ్ గా వెల్ కం చెప్పటానికి ఆంధ్రాలో ఇంతమంది అభిమానులు ఉన్నారా? అన్నది చూస్తే.. ఇక్కడో ఆసక్తికర కోణం బయటకు వస్తుంది. ఫ్యామిలీతో వస్తున్న కేసీఆర్ ను ఘనంగా వెల్ కం చెప్పేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు.. పోస్టర్లలో కేసీఆర్ ను విపరీతంగా పొగిడేసిన వైనం కనిపిస్తుంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారంటే..తమిళనాడులోని తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఏర్పాటు చేశారు.

ఎయిర్ పోర్ట్ మార్గంలో ఈ ఫ్లెక్సీలు.. పోస్టర్ల హడావుడి భారీగా కనిపిస్తుంది. ఈ ఏర్పాటు అధికారులకు పెద్ద పరీక్షగా మారింది. ఎందుకంటే.. ఇప్పుడు తిరుపతిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు అవుతుంది. ఇలాంటి వేళ.. రాజకీయ నేతల పోస్టర్లను అనుమతించరు. అలా అని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తే.. ఆయన్ను అవమానించారన్న చెడ్డ పేరు ఏపీ సర్కారుకు వస్తుంది. దీంతో.. కిందామీదా పడిన రెవెన్యూఅధికారులు కొన్నిచోట్ల పోస్టర్లను తీసేయగా.. మరికొన్ని చోట్ల వదిలేశారు.

కోడ్ నేపథ్యంలో పోస్టర్లను తొలగించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పోస్టర్లు ఏర్పాటు చేసిన కేతిరెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పక్క రాష్ట్రం నుంచి వస్తున్న ముఖ్యమంత్రికి మనం ఇచ్చే మర్యాద ఇదేనా? పోస్టర్లను తీసేయటం ఆయన్ను అవమానించినట్లు కాదా? అంటూ వేసిన ప్రశ్నలకు అధికారులు గతుక్కుమన్న పరిస్థితి. పోస్టర్ల తొలగింపు కేసీఆర్ అవమానం ఖాతాలో వేస్తే.. లేనిపోని తలనొప్పులు ఖాయన్న భావనకు గురైన అధికారులు కొన్నిచోట్ల పోస్టర్లను తొలగించేయగా.. అవమానం వాదన తెరపైకి వచ్చాక మాత్రం మరికొన్నిచోట్ల తీసేయకుండా వదిలేశారు.

దీనిపై కొందరు కోడ్ ను ఉల్లంఘిస్తారా? అని అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు.దీంతో.. రెవెన్యూ అధికారులకు మహా ఇబ్బందిగా మారింది. పోస్టర్ తీస్తే అవమానం అంటున్నారని.. తీయకుండా ఉంటే కోడ్ ను ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నిస్తున్నారని.. కేసీఆర్ టూర్ ఏమో కానీ.. తమకు కొత్త తిప్పలు తెచ్చి పెట్టిందన్న అభిప్రాయాన్ని కొందరు అధికారులు వ్యాఖ్యానించటం గమనార్హం. ఏది ఏమైనా కేసీఆర్ టూర్ తిరుపతి అధికారులకు చుక్కలు చూపిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/