Begin typing your search above and press return to search.

వైఎస్ సైన్యంపై కేసీఆర్ గురి పెట్టారే!

By:  Tupaki Desk   |   24 Jun 2018 10:30 AM GMT
వైఎస్ సైన్యంపై కేసీఆర్ గురి పెట్టారే!
X
వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి... సంక్షేమానికి కొత్త భాష్యం చెప్పిన నేత‌. ఇదేదో వైఎస్ అనుకూల వ‌ర్గ‌మో - వైఎస్ కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్థాపించిన వైసీపీ నేత‌లో, వైఎస్ కొన‌సాగిన కాంగ్రెస్ పార్టీ నేత‌లో చెప్పే మాట ఎంత‌మాత్రం కాదు. వైఎస్‌కు రాజ‌కీయ శ‌త్రువులుగా ముద్ర‌ప‌డిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు వంటి వారి నోట వినిపించిన మాట ఇది. అది కూడా తెలంగాణ శాస‌న స‌భా వేదిక‌గా సీఎం హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య ఇది. వ్య‌క్తులు ఎవ‌రైనా - పార్టీ ఏదైనా... మంచిని మంచిగా - చెడును చెడుగా చెప్పాల్సిందేన‌ని, ఆ కోవ‌లో వైఎస్ అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు జ‌నం మ‌దిలో నిలిచిపోయాయ‌ని కేసీఆర్ కీర్తించారు. మొత్తంగా వైఎస్ మ‌ర‌ణించి దాదాపు ప‌దేళ్లు కావ‌స్తున్నా... ఇప్ప‌టికీ ఆయ‌న అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు - సాగించిన పాల‌న ఇంకా జ‌నం మ‌దిలో నుంచి దూరం కాలేద‌నే చెప్పాలి.

అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకంటే... సంక్షేమ పాల‌న‌కు త‌నదైన శైలిలో స‌త్తా చాటిన వైఎస్‌... త‌న‌కంటూ ఓ న‌మ్మ‌క‌మైన వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేనా... 2004 ఎన్నిక‌ల్లో తెలుగు నేల రాజ‌కీయాల్లోకి కొత్త ముఖాల‌ను తీసుకురావ‌డ‌మే కాకుండా, అప్ప‌టికే చాలా కాలం పాటు పార్టీలో ఉన్నా పెద్ద‌గా గుర్తింపు లేని వారికి త‌న ప్ర‌భుత్వంతో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో కీల‌క స్థానాల‌ను ఇచ్చి యువ‌త‌కు పెద్ద పీట వేశారు. అలాంటి వారిలో ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో చక్రం తిప్పుతున్న నేత‌లు చాలా మందే ఉన్నారు. అలాంటి జాబితాలో దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ - దానం నాగేంద‌ర్‌ - డీకే అరుణ‌ - ముఖేశ్ గౌడ్‌ - కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి - సుధీర్ రెడ్డి - ఉత్త‌మ్ కుమార్ రెడ్డి - గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి - సునీతా ల‌క్ష్మారెడ్డి - సుద‌ర్శ‌న్ రెడ్డి - సంబాని చంద్ర‌శేఖ‌ర్‌ - శ్రీ‌శైలం గౌడ్‌ - డీఎస్ రెడ్యా నాయ‌క్.. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే జాబితా చాంత‌డంత అవుతుంది. అయినా పైన చెప్పిన పేర్ల‌న్నీ కేవలం తెలంగాణ‌కు చెందిన‌వి మాత్ర‌మే. ఇక ఏపీ పేర్లు క‌లిపితే... ఆ జాబితా ఎంత పెద్ద‌దవుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి.

మ‌రి వైఎస్ అనుచ‌ర గ‌ణంలో ఒక్క తెలంగాణ వారి పేర్లు మాత్ర‌మే ఎందుకు చెబుతున్నామంటే... వీరంద‌రిపై గులాబీ ద‌ళ‌ప‌తి గురి పెట్టేశారు మ‌రి. ఇప్ప‌టికే ట్విట్ సిటీస్‌ లో వైఎస్‌ కు వీరాభిమానిగానే కాకుండా వైఎస్ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌నిచేసిన దానం నాగేంద‌ర్ ఇప్ప‌టికే కాంగ్రెస్‌ ను వీడి టీఆర్ ఎస్‌ లో చేరిపోతున్నారు. దానం బాట‌లోనే ట్విన్ సిటీస్‌ లో వైఎస్ హ‌యాంలో మంచి పేరు సంపాదించుకున్న‌ ముఖేశ్ గౌడ్ - సుధీర్ రెడ్డిలు కూడా త్వ‌ర‌లోనే పార్టీ మారే అవ‌కాశాలున్నాయి. ఇక డీకే అరుణ‌ - కోమ‌టిరెడ్డిలతోనూ టీఆర్ ఎస్ నేత‌లు ట‌చ్‌లోనే ఉన్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా డీకే - కోమ‌టిరెడ్డిలే స్వ‌యంగా వెల్లడించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయినా వీరిపైనే కేసీఆర్ ఎందుకు గురి పెట్టార‌న్న విష‌యానికి వ‌స్తే... చాలా ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలుగు చూడ‌క మాన‌వు. రాజ‌కీయ తెరంగేట్రం నాటి నుంచి కూడా ఓట‌మి అన్న‌దే వైఎస్‌ కు ఎదురు కాలేదు. అందుకు కార‌ణం... ఆయ‌న జ‌నంతో మ‌మేక‌మ‌వ‌డ‌మే. వైఎస్ అడుగు జాడ‌ల్లో న‌డిచిన ఆయ‌న ముఖ్య అనుచ‌రులు కూడా వైఎస్ మాదిరే జ‌నంతో మ‌మేక‌మ‌య్యారు. జ‌నం మ‌న‌సుల్లో చిర‌స్థానాన్ని సంపాదించుకున్నారు. వెరసి వారి వారి నియోజవ‌ర్గాలు, జిల్లాల్లో బ‌ల‌మైన నేత‌లుగా ఎదిగారు.

మ‌రి ఇంకో ఏడాదిలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ గెల‌వాలంటే... ప్ర‌జ‌ల్లో ప‌ట్టున్న ఇలాంటి నేత‌లు ప్ర‌త్య‌ర్థులుగా బ‌రిలోకి దిగ‌రాదు. 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా సాధించిన ఉద్య‌మ పార్టీగా టీఆర్ ఎస్‌ కు ప్ర‌జ‌లు ఓటేశారు. ఉద్య‌మ పార్టీ అన్న భావ‌న నాడు జ‌నాల‌కు మ‌రో ప్ర‌త్యామ్నాయాన్ని చూప‌లేద‌న్న వాద‌న కూడా వినిపించింది. అయిఏ 2019 ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి అందుకు విరుద్ధంగానే ఉండ‌నుంది. ఎందుకంటే కొత్త రాష్ట్రంలో తొలి స‌ర్కారును ఏర్పాటు చేసిన కేసీఆర్‌... కొంత‌మేర మంచి ప‌నులే చేసినా... ఎంతో కొంత ప్ర‌భుత్వ వ్యతిరేక‌త‌ను అయితే మూట‌గ‌ట్టుకున్న‌ట్టే క‌దా. ఆ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకోవాలంటే... వైఎస్ సైన్యం కేసీఆర్‌కు అవ‌స‌ర‌మే. అందుకే ఇప్పుడు గులాబీ పార్టీ వైఎస్ స‌న్నిహితుల‌పై క‌న్నేసింది. ఇందులో భాగంగా రెండేళ్ల నుంచి దోబూచులాడిన దానం నాగేంద‌ర్ చేరిక దాదాపుగా ముగిసిపోయింది. ఇక దానం బాట‌లోనే ప‌య‌నించేందుకు ముఖేశ్, సుధీర్ రెడ్డిలు దాదాపుగా సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత మిగిలిన వారిని లాగేందుకు కేసీఆర్ అండ్ కో త‌మ‌దైన శైలి య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తుంద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ‌లో టీఆర్ఎస్ గెలుపున‌కు కేసీఆర్‌ కు వైఎస్ సైన్యం అవ‌స‌ర‌మైంద‌న్న మాట‌.