Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కొత్త ఐడియా ఇచ్చిన కాంగ్రెస్ నేత‌లు

By:  Tupaki Desk   |   14 March 2018 5:17 AM GMT
కేసీఆర్ కు కొత్త ఐడియా ఇచ్చిన కాంగ్రెస్ నేత‌లు
X
స‌రైన అవ‌కాశాల కోసం ఎదురుచూసే వారికి ఎప్పుడో ఒక‌ప్పుడు అవ‌కాశం త‌లుపు త‌ట్ట‌క మాన‌దు. కానీ.. అవ‌కాశం సృష్టించుకునే వారికి స‌మ‌యంతో ప‌ని లేదు. చిన్న సానుకూల‌త చాలు.. ఇట్టే అల్లుకుపోతారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెండో త‌ర‌హా. ఆయ‌న అవ‌కాశం వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయ‌రు. త‌న ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్లుగా చిన్న పరిణామం చోటు చేసుకుంటే చాలు.. త‌న‌కు త‌గ్గట్లు ఆ ప‌రిణామాన్ని మార్చేసుకుంటారు.

ఇందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా తాజా ఎపిసోడ్ ను చెప్పుకోవాలి. జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌న్న బ‌ల‌మైన కాంక్ష‌తో ఉన్న కేసీఆర్‌.. త‌న స‌త్తా చాటాల‌న్న అతృత‌తో ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్లే ప‌క్కా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి వేళ అసెంబ్లీ స‌మావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు అత్యుత్సాహంతో చేసిన ప‌ని కేసీఆర్ కు కొత్త ఆలోచ‌న‌లు వ‌చ్చేలా చేసింద‌న్న మాట వినిపిస్తోంది.

బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా స‌భ‌లో ర‌చ్చ చేసే క్ర‌మంలో.. అదుపు త‌ప్పిన కాంగ్రెస్ నేత‌లు హెడ్ ఫోన్ ను గ‌వ‌ర్న‌ర్ ల‌క్ష్యంగా చేసుకొని విస‌ర‌టం.. అది కాస్తా గురి త‌ప్పి మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ కంటికి త‌గ‌ల‌టం తెలిసిందే. ఒక‌వేళ హెడ్ ఫోన్ విసిరిన‌ప్పుడు ఎవ‌రికి ఏమీ కాక‌పోతే ఇంత ర‌చ్చజ‌రిగేది కాదు. ఎప్పుడైతే స్వామిగౌడ్‌కు త‌గిలిందో.. దాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు. చ‌క‌చ‌కా పావులు క‌దిపారు.

స్వామిగౌడ్‌ కు త‌గిలింది చిన్న దెబ్బా? పెద్ద దెబ్బా? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఆయ‌న మాట‌ల్లోనే చెప్పాలంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌ను ఆసుప‌త్రికి వెళ్లాల‌న్న సూచ‌న చేశారంటూ స్వామిగౌడ్ స్వ‌యంగా చెప్పారు. అసెంబ్లీకి ద‌గ్గ‌ర్లోని స‌రోజినిదేవి కంటి ఆసుప‌త్రికి వెళ్లిన మండ‌లి ఛైర్మ‌న్ కాసేప‌టికే కంటికి పెద్ద క‌ట్టుతో క‌నిపించారు. ఒక్క‌సారిగా ఆయ‌న కంటికి వేసిన క‌ట్టును టీవీ ఛాన‌ల్స్ లో చూసిన వారంతా.. అయ్యో అన్న ప‌రిస్థితి.

అసెంబ్లీలో గొడ‌వ‌లు మామూలే అయినా.. మ‌రీ ఇంత దెబ్బ త‌గిలేలా వ్య‌వ‌హ‌రిస్తారా? అన్న భావ‌న ప‌లువురిలో క‌లిగింది. వేగంగా మారిపోతున్న ప‌రిణామాల తీవ్ర‌త‌ను కాంగ్రెస్ నేత‌లు అంచ‌నా వేసేస‌రికే.. జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయింది. మండ‌లి ఛైర్మ‌న్ పై కాంగ్రెస్ నేత దాడి చేసిన వైనంపై గులాబీ నేత‌లు చేయాల్సినంత ప్ర‌చారం చేసేవారు.

స‌భ‌లో మ‌ర్యాద త‌ప్పే వారి విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిందేన‌ని.. గ‌తంలోనే స‌భ్యులు ఎలా ఉండాల‌న్న అంశంపై ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిన ద‌రిమిలా చ‌ర్య‌లు ఉంటాయ‌న్న సంకేతాల్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చేసింది. దీనికి త‌గ్గ‌ట్లే తెలంగాణ ప్ర‌భుత్వం భారీ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. స్పీక‌ర్ పేరిట వెలువ‌డిన నిర్ణ‌యం చూస్తే.. ఇద్ద‌రు స‌భ్యుల్ని (కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. సంప‌త్‌ కుమార్) శాస‌న స‌భ్య‌త్వాల్ని ర‌ద్దు చేయ‌టంతో పాటు.. మిగిలిన కాంగ్రెస్ నేత‌లంద‌రిని స‌భ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

త‌ప్పు జ‌రిగిందంటూ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత జానారెడ్డి బీఏసీ స‌మావేశంలో ఒప్పుకున్న త‌ర్వాత కూడా ఇంత తీవ్ర నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న మాట ప‌లువురిలో వ్య‌క్త‌మైంది. అయితే.. ఈ నిర్ణ‌యం వెనుక భారీ వ్యూహం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఇద్ద‌రు నేత‌ల శాస‌న‌స‌భ్య‌త్వాల్ని ర‌ద్దు చేసిన నిర్ణ‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంప‌టం..ఈసీ కానీ వెంట‌నే ఆమోద‌ముద్ర వేసిన ప‌క్షంలో.. త్వ‌ర‌లో జ‌రిగే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లకు విడుద‌ల చేసే నోటిఫికేష‌న్ తో పాటు.. రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక వ‌చ్చేలా పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఎందుకిలా అంటే? దీని వెనుక భారీ ప్లానింగ్ జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. కేసీఆర్ కున్న న‌మ్మ‌కం ఏమిటంటే.. రెండు స్థానాల్లో ఉప ఎన్నికను తీసుకురావ‌టం ద్వారా.. ఈ రెండు చోట్ల త‌మ‌కున్న బ‌లం మొత్తాన్ని ఉప‌యోగించి ఉప ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు బ‌ల‌మైన నేత‌ల‌కు ఓట‌మి రుచి చూపించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. తాము అనుకున్న‌ట్లు జ‌రిగితే తెలంగాణ‌లో కాంగ్రెస్ ఉనికి లేద‌న్న వైనాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లు అవుతుంద‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా చెబుతారు.

ఆయ‌న అనుకున్న‌ట్లు జ‌రిగితే.. కీల‌క‌మైన 2019 ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ మీద భారీగా ప‌డుతుంద‌ని.. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రిస్తుంద‌న్న భావ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. అంతేకాదు.. జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతున్న వేళ‌.. సొంత రాష్ట్రంలో త‌న‌కున్న బ‌లాన్ని దేశం మొత్తానికి చూపించ‌ట‌మే కాదు.. త‌మ రాష్ట్రంలో కాంగ్రెస్.. బీజేపీల ప్ర‌భావం అస‌లేమీ ఉండ‌ద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల అత్యుత్సాహం కేసీఆర్ కు కొత్త వ్యూహానికి కార‌ణంగా మారింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.