Begin typing your search above and press return to search.

ముందస్తుకు దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్?

By:  Tupaki Desk   |   15 Feb 2022 7:50 AM GMT
ముందస్తుకు దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్?
X
అందరికి అర్థమయ్యేలా ఉంటే అదెందుకు రాజకీయం అవుతుంది? అన్ని అర్థమైనట్లే అనిపిస్తూనే అసలేం అర్థం కానట్లుగా ఉండటం రాజకీయం ప్రత్యేకత. అందునా మాస్టర్ మైండ్ కేసీఆర్ లాంటి తలపండిన రాజకీయ అధినేత ఏ పని ఉత్తినే చేయరు. ఆయన వేసే ప్రతి అడుగు వెనుక.. చెప్పే ప్రతి మాటకు అర్థానికి అసలు పరమార్థం పైకి కనిపించే దానికి భిన్నంగా ఉంటుంది. మొన్నటివరకు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శ చేయటానికి.. ఘాటు వ్యాఖ్య చేయటానికిక తెగ మొహమాటం పడే కేసీఆర్.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎందుకు విరుచుకుపడుతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

షెడ్యూల్ ప్రకారం చూస్తే.. వచ్చే ఏడాది నవంబరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అప్పటివరకు కాకుండా.. దాని కంటే కాస్త ముందుగానే ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న అంశంపై కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. రెండు టర్మ్ లు పాలన సాగించిన అధికార పార్టీకి సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దాన్ని అధిగమించేందుకు వీలుగా ఎజెండా సిద్ధం చేయాల్సి ఉంటుంది. అందుకే.. కేసీఆర్ ఇప్పుడు గేర్ మార్చారని చెబుతున్నారు.

మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీ మాంచి జోరు మీద ఉండటం.. ఆ పార్టీని ఎదుర్కోవటానికి కాస్తంత ఇబ్బందికి గురైన కేసీఆర్.. ఇప్పుడు ఆట మొత్తాన్నిమార్చేసే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపించినప్పటికీ.. ఏ చిన్న అవకాశం వచ్చిపుంజుకున్నా.. దాని దూకుడును ఆపటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయం కేసీఆర్ కు తెలీనది కాదు. అందుకే.. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా.. ఆట మొత్తం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యన ఉందన్న భావన కలిగేలా చేయటం కోసం ఆయన కష్టపడుతున్నారు.

దీనికి తోడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ అంచనాను దెబ్బ తీసేలా ఉండటం.. ఆయన ఎత్తులు ఏవీ పలించకపోవటంతో గులాబీ బాస్ అంతర్మథనానికి గురైనట్లు చెబుతారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించటానికి.. బలమైన భావోద్వేగాన్ని తెర మీదకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే బీజేపీని తన ప్రత్యర్థిగా ఆయన డిసైడ్ అయ్యారని చెబుతారు. ఇందుకు తగ్గట్లే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనంతరం తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోవటం కాంగ్రెస్ సోదిలో లేకుండా పోవటం.. బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారటం తెలిసిందే.

ఇప్పుడు అదే పంథాలో సాగుతున్న కేసీఆర్ తీరు చూస్తే.. ఆయన లక్ష్యాలు రెండుగా చెబుతున్నారు. అందులో ఒకటి ఈ ఏడాది కానీ.. వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లటం.. రెండోది తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుకాకుండా.. బీజేపీని ఎదిగేలా చేసి.. దానితో పోరాటం చేయటమని చెబుతున్నారు. కాంగ్రెస్ మీద తెలంగాణ ప్రజల్లో సానుకూలతతో పాటు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ మీద అంతో ఇంతో సానుభూతి ఉంటుందన్న ఆలోచనతో ఉన్న కేసీఆర్..

అదే బీజేపీ అయితే మోడీ సర్కారు రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న వాదననను బలంగా వినిపించటం ద్వారా.. తనకు అలవాటైన భావోద్వేగ అస్త్రాన్ని ప్రయోగించి ముందస్తు ఎన్నికల్లో విజయతీరాలకు చేరాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.